దిల్లీ:

*సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి విజయం సాధించేందుకు ప్రయత్నాలు చేస్తోన్న భాజపా*

.. ముమ్మర ప్రచారం చేస్తోంది. విపక్ష పార్టీలను ఎండగడుతోంది. ఈ క్రమంలో పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్య్వూలో ప్రధాని మోదీ ఇదే అంశంపై మాట్లాడారు. ఈసందర్భంగా తన తల్లి హీరాబెన్‌ను గుర్తు చేసుకున్న ఆయన.. ఆమె సాధారణ జీవనం గడిపారని, చివరి రోజుల్లో ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స పొందారని వెల్లడించారు.
‘‘అసలు ఈ బ్రాండ్‌ అంటే ఏమిటో.. అది ఎలా పనిచేస్తుందో నాకు తెలియదు. ప్రజలు నా జీవితం, పని తీరును చూస్తున్నారు. 13 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేశా. పదేళ్లుగా ప్రధానిగా ఉన్నా.. నా తల్లి చివరి రోజుల్లో ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందారు. అలాంటప్పుడు దేశానికి బ్రాండ్‌ అవసరం లేదు. నా జీవితం కొంతవరకు భిన్నంగా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు’’ అని ప్రధాని పేర్కొన్నారు.

*నాపై అతిపెద్ద ఆరోపణ..*

తాను గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దుస్తుల విషయంలో మాజీ సీఎం తనపై చేసిన ఆరోపణలను ప్రధాని గుర్తు చేసుకున్నారు. ‘‘మోదీకి 250 జతల దుస్తులు ఉన్నాయంటూ మాజీ సీఎం అమర్‌సిన్హా చౌధరీ ఆరోపించారు. అది నా రాజకీయ జీవితంలో ఎదుర్కొన్న అతిపెద్ద ఆరోపణ. అది తప్పైనప్పటికీ.. నాపై వచ్చిన ఆరోపణలను అంగీకరిస్తున్నట్లు నాడు ఓ బహిరంగ సభలో చెప్పాను. రూ. 250 కోట్లు దోచుకునే సీఎం కావాలా? 250 జతల దుస్తులున్న ముఖ్యమంత్రి కావాలా? అని ప్రజలను అడిగాను. ప్రజలు మాత్రం 250 జతల దుస్తులున్న సీఎం పనిచేస్తాడంటూ ముక్తకంఠంతో నినదించారు. ఆ తర్వాత నాపై ఆరోపణలు చేసే ధైర్యం ప్రత్యర్థులు చేయలేదు’’ అని మోదీ పేర్కొన్నారు.
కాగా.. ప్రతీ ఎన్నికల సమయంలో ప్రధాని తన తల్లి పాదాలు తాకి ఆశీర్వాదం తీసుకునేవారు. కానీ, 2022లో ఆమె కన్నుమూసిన సంగతి తెలిసిందే. తన తల్లిని గుర్తు చేసుకుంటూ.. ‘‘అమ్మ ఆశీర్వాదం లేకుండా తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నా. ఈ రోజు 140 కోట్ల మంది భారతీయులు, లక్షలాది మంది తల్లుల దీవెనలు నాకున్నాయి. వారు నాపై చూపే అభిమానం, ప్రేమలే అండగా ఉన్నాయి’’ అని భావోద్వేగానికి గురయ్యారు….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed