*మహా కుంభమేళాలో మంత్రి లోకేష్ దంపతుల పుణ్యస్నానాలు*

ప్రయాగరాజ్ (యుపి): ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దంపతులు పుణ్యస్నానాలు చేశారు.

త్రివేణి సంగమం షాహి స్నానఘట్టంలో సాంప్రదాయబద్ధంగా స్నానాన్ని ఆచరించి గంగాదేవికి పూజలు చేసి, హారతులు ఇచ్చారు. పితృదేవతలను స్మరించుకుంటూ బ్రాహ్మణులకు వస్త్రదానం చేశారు.

పూర్వీకులకు మోక్షమార్గాన్ని ప్రసాదించాలంటూ గంగాదేవిని ప్రార్థించారు. కుంభమేళా ప్రాంగణంలో ప్రతిధ్వనించే కీర్తనలు, నదీ సంగమం వద్ద పవిత్ర పూజల మధ్య ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో లోకేష్ దంపతులు మమేకమయ్యారు.

మహా కుంభమేళా ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే కాదు.. ఇది భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వం. నమ్మకం, ఆచారాలు, ఆధ్యాత్మిక జ్ఞానంతో ముడిపడి ఉన్న శక్తిమంతమైన వేడుక. మానవత్వం, ఆధ్యాత్మికత మధ్య సంబంధాన్ని, లోతుగా నాటుకుపోయిన భారతజాతి విలువలను ప్రతిబింబిస్తుంది. పవిత్ర నదుల్లో ఆచరించే స్నానం, దానం, హృదయ పూర్వకమైన భక్తి మోక్ష మార్గాన్ని చూపిస్తాయని కోట్లాదిమంది నమ్మకం.

కుంభమేళాలో స్నానాలు, పూజాధికాల అనంతరం లోకేష్ దంపతులు కాశీ విశ్వేశ్వరుని ఆలయాన్ని సందర్శించేందుకు వారణాసి బయలుదేరి వెళ్లారు.
*****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed