నెల్లూరు, ఫిబ్రవరి 21
*భారత ప్రధాని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కలలు కంటున్న వికసిత భారత్, స్వర్ణాంధ్ర లక్ష్య సాధన లో భాగంగా వివిధ పధకాల అమలుకు వేగవంతమైన చర్యలు తీసుకోవాలి : లంకా దినకర్*
భారత ప్రధాని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కలలు కంటున్న వికసిత భారత్, స్వర్ణాంధ్ర లక్ష్య సాధన లో భాగంగా వివిధ పధకాల అమలుకు వేగవంతమైన చర్యలు తీసుకోవాలని 20 సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ సంబంధిత అధికారులకు సూచించారు.
శుక్రవారం నగరంలోని జెడ్పి సమావేశం హాల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పధకాలను జిల్లా కలెక్టర్ ఒ ఆనంద్ తో కలసి సమీక్షించారు. భారతదేశాన్ని విశ్వగురు గా తీర్చిదిద్దే క్రమంలో అమలు చేయాల్సిన విధానాలు, వాటి ద్వారా భవిష్యత్ లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆనంద్ కేంద్ర ప్రభుత్వo ద్వారా జిల్లాలో అమలవుతున్న వివిధ రకాల పథకాల గురించి వివరించారు.
అనంతరం 20 సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, జిల్లా కలెక్టర్ ఆనంద్ లతో కలిసి మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉపాధిహామీపథకం మెటీరియల్ కాంపోనెంట్ వినియోగం, జల్ జీవన్ మిషన్ అమలు తీరు , అమృత్ పథకం నిధుల వినియోగంతో సాధించిన ఫలితాలు, అమృత్ 2.0 లక్ష్యాలు , గ్రామీణసడక్ యోజన, లాక్ పతి దీదీ, గరీబ్ కళ్యాణ్ అన్నయోజన, పీఎంసూర్యఘర్, కుసుమ్, పీఎంఆవాసయోజన, పీఎం విశ్వకర్మ యోజన వంటి కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు తీరుతో పాటు, జిల్లాను ఎలక్ట్రానిక్ హబ్ గా , వస్తు తయారీ కేంద్రంగా మలచడానికి ప్రణాళికలు రచించడం, జిల్లాలో పారిశ్రామికీకరణ అభివృద్ధి తదితర అంశాల పైన జిల్లా కలెక్టర్, ఇతర అధికారులతో సమీక్ష చేయడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి వివిధ పథకాలకు మంజూరవుతున్న నిధులు అర్హులైన అందరికీ అందాలన్నారు. గత ప్రభుత్వంలో జల జీవన మిషన్ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద పూర్తయిన ఇళ్లలో కూడా లబ్ధిదారులు చేరలేదన్నారు. అలాగే అమృత్ పథకం వినియోగంలో కూడా నిధులు ఖర్చు పెట్టలేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు కేంద్ర నిధుల కోసం తీవ్ర కృషి సల్పుతున్నారని, ఆయా పథకాలను మెరుగైన రీతిలో లబ్ధిదారులకు అందించుటకు అధికారులు కృషి చేయాలన్నారు. జిల్లాలోని సోమశిల, కండలేరు ప్రాజెక్టులు జిల్లాకే కాకుండా సమీప కడప, అన్నమయ్య జిల్లాలకు నీటి వనరులను అందించే సౌలభ్యం ఉన్నవని తెలిపారు. అదేవిధంగా పి ఎం సూర్యఘర్ యోజన పథకం ద్వారా ప్రతి ఇంటిని విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మార్చాలనే ఉద్దేశంతో తయారు చేశారని, ఇందుకోసం విద్యుత్తు, సెర్ప్, మెప్మా, మున్సిపల్ శాఖల అధికారులు సంయుక్తంగా నిర్ణీత లక్ష్యసాధనకు కృషి చేయాలన్నారు. అదేవిధంగా రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా మేలురకం పశువుల సంతాన ఉత్పత్తి పెంచడం, ఆవులు , గేదెలను సబ్సిడీ పైన రుణాలు అందించడం ద్వారా పాల ఉత్పత్తి పెంచి గ్రామీణులకు అదనపు ఆదాయం చేకూర్చడానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుందన్నారు.అలాగే జిల్లాలో కృష్ణపట్నం పోర్ట్, పూర్తి కావస్తున్న రామాయపట్నం పోర్ట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటు కు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. జిల్లాలో ఉపాధి అవకాశాలు పెంచి జిల్లాను స్వర్ణాంధ్రలో భాగస్వామ్యం అయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకుని వికసిత భారత్ కు బాటలు వేయాలని కోరారు.
ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.