బిజెపి నూతన అధ్యక్షుడు పదవి పై పలువురి ఆశలు
. రెండవసారి జిల్లా అధ్యక్ష పదవిపై వంశీధర్ రెడ్డి ధీమా
..బీసీ కోటాలో రేసులో వెంపులూరు భాస్కర్ గౌడ్
… తన వంతు ప్రయత్నాలు చేస్తున్న భరత్ కుమార్ యాదవ్
.. రేపు అధ్యక్ష పదవికి సంబంధించి నామినేషన్లుt
భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి పలువురు పోటీ పడుతున్నారు. సోమవారం నెల్లూరు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో బిజెపి జిల్లా అధ్యక్ష పదవికి సంబంధించి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉండడంతో జిల్లాలో అధ్యక్ష పదవిని చేపట్టేందుకు పలువురు తమ వంతు ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడుగా వంశీధర్ రెడ్డి ఉన్నారు. రెండవసారి కూడా ఆయన అధ్యక్ష పదవిపై పలు ఆశలు పెట్టుకుని ఉన్నారు. అందుకు అనుగుణంగా ఆయన పావులు కదుపుతున్నారు. కొందరు ముఖ్యనేతల వద్ద ఇప్పటికే మద్దతు కూడగట్టి దాదాపుగా తనకే పదవి దక్కేలా వ్యూహరచనలో ఉన్నారు
మరోవైపు బీసీ కోటాల జిల్లా అధ్యక్ష పదవిలో అనూహ్యంగా వెంపులూరు భాస్కర్ గౌడ్ పేరు వినిపిస్తోంది. రాష్ట్రీయ స్వయంసేవక్ లో భాస్కర్ గౌడ్ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పనిచేశారు. బిజెపి భావజాలంతో నిరంతరం పనిచేస్తూ 2009 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గం లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పుడే భారతీయ జనతా పార్టీ నెల్లూరు నగర అధ్యక్షుడుగా క్రియాశీలకంగా పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషి చేయడంతో పాటు 2013 నుంచి స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా పని చేశారు. ఈసారి ఆయన బిజెపి జిల్లా అధ్యక్ష పదవి కోసం తన వంతు ప్రయత్నాల్లో ఉన్నారు. గతంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన భరత్ కుమార్ యాదవ్ కూడా జిల్లా అధ్యక్ష రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే భారతీయ జనతా పార్టీలోని జిల్లా ముఖ్య నేతలు, రాష్ట్ర బాధ్యులు నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని ఎంపిక చేసేలా పావులు కదుపుతున్నట్లు సమాచారం.
ఓసి క్యాటగిరి కి సంబంధించి వంశీధర్ రెడ్డి ప్రధాన పేరు వినిపిస్తుండగా బీసీల నుంచి భాస్కర్ గౌడ్, భరత్ కుమార్ యాదవ్ ల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈసారి రాష్ట్ర నాయకత్వం తో పాటు ఆర్ఎస్ఎస్ నాయకత్వం జనరల్ అభ్యర్థిని నియమిస్తారా లేదా బిసి అభ్యర్థికి మద్దతు పలుకుతారో వేచి చూడాల్సిందే