
ప్రధాన డ్రైన్ కాలువల ఆధునికీకరణ పనులు వేగవంతం
– మేయర్ రూప్ కుమార్ యాదవ్
నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని 12 ప్రధాన డ్రైన్ కాలువల విస్తరణ, పూడికతీత, ఆధునికీకరణ పనులను చేపట్టి నిర్దేశించిన సమయంలోపు డ్రైను కాలువల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తయ్యేలా పర్యవేక్షించనున్నామని మేయర్ రూప్ కుమార్ యాదవ్ తెలిపారు.
స్థానిక 39వ డివిజన్ నీలగిరి సంఘం గణేష్ ఘాట్ ఎదురుగా ఉన్న శ్రీనివాస వాటర్ ప్లాంట్ సమీపంలోని వెంగన్న కాలువలో జరుగుతున్న పూడికతీత పనులను నీటిపారుదల శాఖ, నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో కలిసి మేయర్ బుధవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పట్టణ పురపాలక శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ ఆలోచనలతో వర్షాకాలం సమయంలో నగరంలోని కొన్ని ప్రాంతాలు ముంపుకు గురవకుండా డ్రైను కాలువల ద్వారా వరద నీరు సాఫీగా ప్రవహించేలా కాలువలను ఆధునికీకరించనున్నామని తెలిపారు.
డ్రైను కాలువల విస్తరణలో భాగంగా కాలువల ఆక్రమణల తొలగింపులో పేదవారికి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని మేయర్ స్పష్టం చేశారు.
వెంగన్న కాలువను 2.30 కోట్ల రూపాయలతో 250 మీటర్ల మేరకు అనగా సుమారుగా రామయ్య బడి ప్రాంతం వరకు అభివృద్ధి చేస్తున్నారని, అభివృద్ధి పనులను అత్యంత నాణ్యతతో నిర్వహించేలా అధికారులు పర్యవేక్షిస్తున్నారని మేయర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ నాగరాజు, నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం పూర్వపు ఎస్.ఈ రవికృష్ణంరాజు, డి.ఈ రఘురాం, టౌన్ ప్లానింగ్ విభాగం సిటీ ప్లానర్ రఘునాధరావు, స్థానిక నాయకులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.
పి.ఆర్.ఓ
నెల్లూరు నగరపాలక సంస్థ