*ప్రజల కోసం పనిచేస్తేనే పదవులకు సార్ధకత*

– ఆరోగ్య సిబ్బంది 24 గంటలు ప్రజలకు అందుబాటులో వుండాలి.
– అనర్హులకు యిచ్చిన యింటి పట్టాలు రద్దు చేసి అర్హులకు యివ్వండి.
– ఇందుకూరుపేట మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

ప్రజలకు అందుబాటులో వుండని ప్రభుత్వ డాక్టర్లు బదిలీలపై వెళ్లి పోవాలని కోరారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. ఇందుకూరుపేట మండల సమావేశానికి తొలి సారిగా విచ్చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారికి టిడిపి నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న వ్యవసాయం, విద్య, వైద్యం, ఇరిగేషన్, పంచాయతిరాజ్ మరియు హౌసింగ్ తదితర శాఖలకు సంబంధించిన మండల స్థాయి అధికారులు ఆయా శాఖలలో జరుగుతున్న పురోగతిని వివరించారు. మండల స్థాయిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు సంతృప్తి వ్యక్తం చేశారు. రైతులకు యూరియా కొరత రాకుండా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం హయాంలో జగనన్న కాలనీల పేరిట ఇళ్ళు లేని పేదలకు కేటాయించాల్సిన పక్కా గృహాలు ఇళ్ళు వున్న వారికే ఇవ్వడంతో నిజమైన అర్హులకు అన్యాయం జరిగిందన్నారు. మార్చిలోగా అర్హులను గుర్తించి వారికి ఇళ్ళు మంజూరు చేయాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. సంక్రాంతి లోపు రోడ్ల ప్యాచ్ వర్కులు పూర్తి చేయాలని పంచాతిరాజ్ శాఖా అధికారులను కోరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ గత ఐదేళ్లలో గ్రామీణ రోడ్లపై తట్టెడు మట్టి వేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలకు రోడ్లు, సురక్షిత తాగునీరు తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గార్లకు ఆమె ధన్యవాదాలు తెలియచేసారు. ప్రభుత్వ పాఠశాలలో అమలవుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్నభోజన పధకంలో నాసిరకం బియ్యం వినియోగిస్తున్నారని వస్తున్న ఫిర్యాదుల పై విద్యా శాఖాధికారులను వివరణ కోరారు. సాగు నీటి రంగానికి సంబంధించి రైతులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేయాలని ప్రజా ప్రతినిధులకు దిశా నిర్దేశం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు అధికారులను కోరారు.
ఎంపిపి గందల్ల శంకర రావు అధ్యక్షతన జరిగిన ఇందుకూరుపేట మండల సర్వసభ్య సమావేశంలో వైస్ ఎంపిపిలు మమత, లావణ్య, జెడ్పిటిసి జయలక్ష్మి, ఎంపిడిఓ నాగేంద్రబాబు, తహసీల్దారు కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed