
*పన్నుల బకాయిల వసూళ్లను వేకవంతం చేయండి : కమిషనర్ సూర్య తేజ ఐ.ఏ.ఎస్.,*
నగర పాలక సంస్థ పరిధిలోని ఆస్థి పన్ను, కమర్షియల్ భవనాల పన్నులు, తాగునీటి కుళాయి పన్నులు, డ్రైనేజీ పన్నుల వసూళ్లకై నిర్దేశించిన లక్ష్యాలను వేగవంతంగా పూర్తి చేసి, 100% లక్ష్యాలను సాధించాలని కమిషనర్ సూర్య తేజ సచివాలయ కార్యదర్శులను ఆదేశించారు. నెల్లూరు నగర పాలక సంస్థ రెవెన్యూ, ఇంజనీరింగ్ శాఖ అధికారులు, సచివాలయ అడ్మిన్, అమెనిటీ కార్యదర్శులతో కమాండ్ కంట్రోల్ విభాగంలో మంగళవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పన్నుల వసూళ్లకు ప్రతిరోజు ఉదయం నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. 25 వేల రూపాయలకు మించి బకాయిలు ఉన్న వారిని గుర్తించి వారికి సంబంధించిన ఆస్తి సీజ్ చేయాలని సూచించారు. పన్ను బకాయిలు ఉన్న ప్రతి ఒక్క ఆస్తి యజమానికి నోటీసులు జారీ చేసి నిర్దేశించిన సమయంలోపు చెల్లించని పక్షంలో సీజ్ చేస్తామని హెచ్చరికలు తెలియజేయాలన్నారు. అందుబాటులో లేని భవన యజమానులను ఫోన్ ద్వారా సంప్రదించి ఆన్లైన్ పేమెంట్ చేయించేలా తగిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు.
ఈ ఆర్థిక సంవత్సరం మార్చి నెల 31వ తేదీ నాటికి నిర్దేశించిన లక్ష్యాలను అందుకోని కార్యదర్శులఫై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పరిపాలనా,అమెనిటీస్ కార్యదర్శులు మంచినీటి పన్నులను వసూళ్ల లక్ష్యాలను అందుకోవాలని, అపార్టుమెంట్లు, సినిమా హాళ్లు తదితర వాణిజ్య భవనాలకు సంభందించిన పన్నుల వసూళ్ళ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. మొండి బకాయిదారులను గుర్తించి మున్సిపల్ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పన్ను వసూళ్లు కోసం త్వరలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో వసూళ్ల కేంద్రాలను ఏర్పాటు చేసియున్నామని కమిషనర్ తెలిపారు. నగర వ్యాప్తంగా ప్రతీ భవనాన్ని పన్ను పరిధిలోకి తీసుకొచ్చి, డిమాండ్ నోటీసులు జారీ చేయాలని కమిషనర్ ఆదేశించారు. పన్ను వసూళ్ళలో సచివాలయ అడ్మిన్ కార్యదర్శులకు వారాంతపు లక్ష్యాలను నిర్దేశించి కార్పొరేషన్ ఆదాయం పెంచేందుకు అధికారులంతా కృషి చేయాలని కమిషనర్ సూచించారు.
ఈ కార్యక్రమం లో డిప్యూటీ కమీషనర్ చెన్నుడు, రెవిన్యూ ఆఫీసర్ ఇనాయతుల్లా,రెవిన్యూ ఇన్స్పెక్టర్లులు, పరిపాలనా కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.