
*నేషనల్ హైవే కార్యాలయం సమీపంలోని చంద్రబాబు నగర్ కు వెళ్లే మార్గంలో మేజర్ డ్రైన్ కాలువలో వరద నీటి ప్రవాహాన్ని పరిశీలించిన కమిషనర్*
నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద ప్రభావిత ప్రాంతాలలో జనజీవనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలను పర్యవేక్షిస్తూ కమిషనర్ వై.ఓ నందన్ గురువారం సంబంధిత శాఖల అధికారులతో కలిసి విస్తృతంగా పర్యటించారు.
స్థానిక నేషనల్ హైవే కార్యాలయం సమీపంలోని చంద్రబాబు నగర్ కు వెళ్లే మార్గంలో మేజర్ డ్రైన్ కాలువలో వరద నీటి ప్రవాహాన్ని కమిషనర్ పరిశీలించారు.
స్థానికంగా తల్పగిరి కాలనీ తోపాటు వివిధ ప్రాంతాలలో రోడ్లపై నిలిచిన వరద నీటి ప్రవాహాన్ని డ్రైను కాలువల ద్వారా తొలగించేందుకు అవసరమైన చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టి వరద నీరు సాఫీగా ప్రవహించేంత వరకు పనులను కమిషనర్ పర్యవేక్షించారు.
స్థానిక వైయస్సార్ నగర్ మార్గంలో కల్వర్టు బ్రిడ్జి వర్షపు నీటి ప్రవాహానికి కుంగడంతో సమాచారం తెలుసుకుని అప్రమత్తమైన కమిషనర్ ఆ ప్రాంతానికి చేరుకొని ఇంజనీరింగ్ విభాగం అధికారులకు వివిధ సూచనలు జారీ చేశారు. బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నివారించి మరమ్మత్తు పనులకు అవసరమైన చర్యలను వెంటనే చేపట్టాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం, శానిటేషన్ విభాగం, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.