నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తులు విక్రయిస్తే కఠిన చర్యలు
– ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ చైతన్య
పర్యావరణ పరిరక్షణకై ప్రభుత్వం నిర్దేశించిన 120 మైక్రోన్ల కన్నా తక్కువ స్థాయి ప్లాస్టిక్ ఆధారిత ఉత్పత్తులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ చైతన్య హెచ్చరించారు. స్థానిక స్టోన్ హౌస్ పేట ప్రాంతంలో 9 ప్లాస్టిక్ ఉత్పత్తుల హోల్సేల్ దుకాణాలపై మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. దాడుల్లో నిషేధిత సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ 80 కేజీల ఉత్పత్తులను గుర్తించి సీజ్ చేశారు. దుకాణాల యజమానులకు 60 వేల రూపాయల జరిమానా విధించి, మరోసారి నిషేధిత ఉత్పత్తుల విక్రయాలు జరిపితే దుకాణాలను శాశ్వతంగా సీజ్ చేస్తామని హెచ్చరించారు.
నిషేధిత ఉత్పత్తుల తయారీ, రవాణా, నిల్వ, విక్రయం, కొనుగోలు చట్టవ్యతిరేకమైన చర్యలని ప్రజలంతా అవగాహన పెంచుకుని, బాధ్యతగా ప్రవర్తించాలని సూచించారు. నిషేధిత ఉత్పత్తులపై క్రయ,విక్రయాల పై తమకు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామని డాక్టర్ తెలియజేసారు.
ఈ దాడుల్లో నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖ అధికారులు, వార్డు సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.