*దేశంలో ఎడిబుల్‌ ఆయిల్‌ దిగుమతులు 57 శాతం : నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి*

దేశంలో ఎడిబుల్‌ ఆయిల్‌ దిగుమతులు 55-60 శాతం ఉందన్నది వాస్తవమేనా అని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆరా తీశారు.

ఈ మేరకు లోక్‌సభలో బుధవారం ఎడిబుల్‌ ఆయిల్స్‌ దిగుమతులపై పలు ప్రశ్నలు వేశారు. భారతదేశం ఏఏ దేశాల నుంచి నూనెలను దిగుమతి చేసుకుంటుందో తెలియజేయాలని కోరారు.

నూనెల వినియోగాన్ని తెలుసుకునేందుకు కేంద్రం ఏదైనా సర్వే ప్రారంభించిందా అని ప్రశ్నించారు. ఎడిబుల్ ఆయిల్ వినియోగాన్ని తెలుసుకోవడానికి ప్రభుత్వం ఒక సర్వేను రూ.10100 కోట్లతో చేపట్టిందన్నది వాస్తవమేనా అని వివరాలు కోరారు.

దేశంలో ఎడిబుల్‌ ఆయిల్‌ దిగుమతులను తగ్గించి ఉత్పత్తిని 2022-23లో 39 మిలియన్ టన్నుల నుంచి 2030-31 నాటికి 70 మిలియన్ టన్నులకు పెంచడానికి చేస్తున్న ప్రయత్నాలు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నలకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి శ్రీమతి నిముబెన్ జయంతిభాయ్ బంభానియా లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

దేశంలో ఉత్పత్తి అయ్యే నూనెలు దేశీయ అవసరాలను అందుకోలేకపోతున్నందున 57% ఆహార నూనెలను వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపారు.

దిగుమతి చేసుకున్న మొత్తం నూనెల్లో పామాయిల్ (ముడి + శుద్ధిచేయబడింది) దాదాపు 57% ఉందన్నారు. ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా దేశాల నుంచి నూనెలను దిగుమతి చేసుకుంటున్నామన్నారు.

20% సోయాబీన్ నూనెను అర్జెంటీనా, బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకుంటుండగా.. 22% సన్‌ఫ్లవర్‌ ఆయిల్ ప్రధానంగా ఉక్రెయిన్, రష్యా నుంచి దిగుమతి అవుతుందని కేంద్ర మంత్రి వివరించారు.

ఇక వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ MyGov.in ద్వారా ఆహార నూనె వినియోగంపై ఆన్లైన్ సర్వేను ప్రారంభించిందని, ఈ సర్వే కోసం ఎలాంటి నిధులు కేటాయించలేదని చెప్పారు.

దేశవ్యాప్తంగా నూనె గింజల ఉత్పత్తిని పెంచడానికి, ఎడిబుల్ ఆయిల్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు 2024-25 నుంచి 2030-31 మధ్య జాతీయ ఎడిబుల్ ఆయిల్స్ – ఆయిల్‌ సీడ్స్‌(NMEO-OS) మిషన్‌ను అమలుచేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ఇందుకోసం 10103.38 కోట్లు కేటాయించినట్లు వివరించారు.

జాతీయ ఎడిబుల్‌ ఆయిల్‌ మిషన్‌(NMEO) కింద ప్రధానంగా ఆవాలు, వేరుశనగ, సోయాబీన్, పొద్దుతిరుగుడు, నువ్వుల వంటి కీలకమైన నూనెగింజల పంటల ఉత్పత్తిని మెరుగుపరచడం జరుగుతుందన్నారు. అలాగే పత్తి గింజలు, వరి ఊక, మొక్కజొన్న నూనె మరియు ట్రీ బోర్న్ ఆయిల్స్ వంటి ద్వితీయ వనరుల నుంచి సేకరణ, వెలికితీత సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఇక ప్రాథమిక నూనెగింజల ఉత్పత్తిని 39 మిలియన్ టన్నుల నుంచి 2030-31 నాటికి 69.7 మిలియన్ టన్నులకు పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

దాంతోపాటు ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించి ఆహార నూనెల్లో దేశాన్ని ఆత్మనిర్బర్‌గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్- ఆయిల్‌ పామ్(NMEO-OP)ను కూడా ప్రారంభించిందన్నారు. ఈ మిషన్ కింద 2021-22 నుంచి 2025-26 మధ్య 6.5 లక్షల హెక్టార్ల అదనపు విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు వస్తుందన్నారు.. ఇందులో ఈశాన్య రాష్ట్రాల్లో 3.28 లక్షల హెక్టార్లు, మిగతా ప్రాంతాల్లో 3.22 లక్షల హెక్టార్ల సాగు పెరుగుదల వస్తున్నట్లు పేర్కొన్నారు.

దేశంలో నూనెగింజల రైతులకు మద్దతుగా, ముడి సోయాబీన్ ఆయిల్, ముడి పామ్ ఆయిల్, ముడి సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌పై ప్రాథమిక కస్టమ్ డ్యూటీని 0% నుంచి 20%కి పెంచినట్లు కేంద్రమంత్రి వివరించారు. తద్వారా ముడి నూనెలపై సుంకం 27.5%కి పెరిగిందన్నారు. అదనంగా, రిఫైన్డ్ పామ్ ఆయిల్, రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మరియు రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్స్‌పై ప్రాథమిక కస్టమ్ డ్యూటీని 12.5% నుంచి 32.5%కు పెంచామన్నారు. తద్వారా రిఫైన్డ్ ఆయిల్స్‌పై సుంకం 35.75%గా ఉందన్నారు. దేశీయ నూనె గింజల రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ సర్దుబాట్లు జరిగాయని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed