ఢిల్లీ ఎన్నికలు: బీజేపీ రెండో జాబితా రిలీజ్, ఆప్ మాజీ నేతకు టికెట్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. తాజాగా, భారతీయ జనతా పార్టీ తన రెండో జాబితాను విడుదల చేసింది. శనివారం రాత్రి 29 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను బీజేపీ రిలీజ్ చేసింది. కాగా, శుక్రవారం ఎమ్మెల్యేల అభ్యర్థుల జాబితాను ఖరారు చేసేందుకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తోపాటు పలువురు బీజేపీ సీనియర్ నాయకులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఈరోజు బీజేపీ తన రెండో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీలో చేరిన కపిల్ మిశ్రాను కరవాల్ నగర్ నుంచి, హరీశ్ ఖురానాకు మోతీనగర్ అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ ఇచ్చారు. ఈ జాబితాలో ఐదుగురు మహిళలకు చోటు దక్కింది.
త్రినగర్ నుంచి తిలక్ రామ్ గుప్తాకు బీజేపీ టికెట్ ఇచ్చింది. సుల్తాన్‌పూర్ మజ్రా అభ్యర్థిగా కర్మ సింగ్ ను ప్రకటించింది. లక్ష్మీనగర్ నుంచి అభయ్ వర్మకు మరోసారి అవకాశం కల్పించింది. ప్రస్తుతం లక్ష్మీనగర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు అభయ్ వర్మ. కాగా, జనవరి 4న బీజేపీ 29 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను విడుదల చేసింది. తొలి జాబితాలో న్యూఢిల్లీ, కల్కాజీ వంటి పలు హైప్రొఫైల్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది
నామినేషన్ల దాఖలుకు జనవరి 17 చివరి తేదీ, ఆ తర్వాత జనవరి 18న నామినేషన్ల పరిశీలన, జనవరి 20 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో ఫిబ్రవరి 5న జరుగనుండగా, ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.
మరోవైపు, బీజేపీ, ఆప్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్.. బీజేపీ తన ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాజీ ఎంపీ రమేశ్ బిధూరిని నిలబెట్టాలని నిర్ణయించుకున్నారని అన్నారు. అయితే, దీన్ని “నిరాధారమైన పుకారు” అని కొట్టిపారేయాలని సవాల్ విసిరారు. దీంతో రాజకీయ లబ్ధి కోసం కేజ్రీవాల్ అసత్య ప్రచారం చేస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు.
‘బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని కేజ్రీవాల్ నిర్ణయించగలరా? అలాంటి వాదనలు చేయడానికి ఆయన ఎవరు?’ అని అమిత్ షా ప్రశ్నించారు. ‘జుగ్గీ బస్తీ ప్రధాన్ సమ్మేళన్’లో అమిత్ షా ప్రసంగించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ మోసపూరిత వ్యాఖ్యలను పట్టించుకోరని అన్నారు. బీజేపీని గెలిపించేందుకు సిద్ధమయ్యారని చెప్పారు
(*జన హుషార్ న్యూస్*)