
*ఖాళీ స్థలాల యజమానులు వారి స్థలాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా సంబంధిత వార్డు సచివాలయ కార్యదర్శులు తెలియజేసి, స్థానికులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి: కమిషనర్ వై.ఓ నందన్*
రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సోమవారం నిర్వహించారు. కమిషనర్ వై.ఓ నందన్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో మురుగునీరు రోడ్లపై చేరకుండా డ్రైన్ కాలువల నిర్మాణం, మరమ్మత్తు పనులను అన్ని డివిజన్లలో చేపడుతున్నామని తెలిపారు. ఖాళీ స్థలాల యజమానులు వారి స్థలాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా సంబంధిత వార్డు సచివాలయ కార్యదర్శులు తెలియజేసి, స్థానికులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. డ్రైను కాలువలను ఆక్రమించి ఎలాంటి నిర్మాణాలను చేపట్టవద్దని, అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లో తొలగించి వేస్తామని కమిషనర్ హెచ్చరించారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందుకున్న విజ్ఞప్తులను నిర్దేశించిన సమయంలోపు శాశ్వత పరిష్కారం అందించాలని అధికారులను ఆదేశించారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో విభాగాల వారీగా అకౌంట్ సెక్షన్ 4, ఆప్కాస్ 4, ఇంజనీరింగ్ 14, హెచ్ సెక్షన్ 2, హౌసింగ్ సెక్షన్ 26, పబ్లిక్ హెల్త్ 8, రెవెన్యూ 7, టౌన్ ప్లానింగ్ 8, పెన్షన్ 5, మొత్తం 78 వినతులను కమిషనర్ స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, సిటీ ప్లానర్ హిమబిందు, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కనకాద్రి, డిప్యూటీ సిటీ ప్లానర్ రఘునాధరావు, మేనేజర్ రాజేశ్వరి, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు