కోర్టు కేసుల మాఫీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి

– డిసెంబర్ 13న నేషనల్ లోక్ అదాలత్

– కమిషనర్ వై.ఓ నందన్

నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఆస్తి పన్నులు, తాగునీటి కుళాయి పన్నులు, ఖాళీ స్థలం పన్నులు, ట్రేడ్ లైసెన్సు పన్నుల ఎగవేతదారులు, అనధికార నిర్మాణాలు లేదా అనుమతులను అతిక్రమించి చేపట్టిన నిర్మాణ యజమానులుపై క్రిమినల్ చర్యలకు న్యాయస్థానాల ద్వారా దాఖలు చేసిన కేసులను మాఫీ చేసుకునేందుకు కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ వై.ఓ నందన్ సూచించారు.

నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమిషనర్ చాంబర్లో అన్ని విభాగాల ఉన్నతాధికారులతో లోక్ అదాలత్ నిర్వహణ అంశంపై శుక్రవారం సమీక్షించిన అనంతరం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి కమిషనర్ మాట్లాడారు.

నగరపాలక సంస్థకు చెల్లించవలసిన పన్ను బకాయి దారులకు సంబంధిత విభాగాల నుంచి నోటీసులను జారీ చేసి, వారంతా నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయస్థానంలో రాబోవు డిసెంబర్ నెల 13వ తేదీన శనివారం నిర్వహించనున్న నేషనల్ లోక్ అదాలత్ కు హాజరయ్యేలా అన్ని చర్యలు తీసుకునేలా అధికారులకు దిశా నిర్దేశం చేసామని తెలిపారు.

జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించనున్న లోక్ అదాలత్ ద్వారా బకాయీల మొత్తాలను అపరాధ రుసుముతో సహా చెల్లించి వారిపై నమోదయున్న కేసులను మాఫీ చేయించుకునేలా చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ తెలిపారు.

జిల్లా ప్రధాన న్యాయస్థానం ప్రాంగణంలో ఆరోజు ఏర్పాటు చేసే ఎన్.ఎమ్.సి పన్నుల వసూలు కేంద్రంలో చెల్లింపులు జరపవచ్చని, బకాయీలను అపరాధ రుసుముతో సహా చెల్లించని వారిపై మూడు సంవత్సరముల వరకు కారాగార శిక్ష విధించేందుకు చట్టం అనుమతిస్తుందని కమిషనర్ తెలియజేశారు.

గౌరవ సుప్రీం కోర్టు వారి ఆదేశాల మేరకు ప్రతి 3 నెలలకు నేషనల్ లోక్ అదాలత్ ను నిర్వహిస్తారని, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ప్రతి శనివారం జిల్లా ప్రధాన న్యాయస్థానంలో లోక్ అదాలత్ ను నిర్వహిస్తారని కమిషనర్ తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎల్.ఆర్.ఎస్ పథకాన్ని మరో మూడు నెలల పాటు పొడిగించిందని, తేదీ 23-01-2026 వరకు అందిస్తున్న ఈ సువర్ణ అవకాశాన్ని అన్ని అనధికార లేఔట్ల యజమానులు, ప్లాట్ల యజమానులు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ సూచించారు.

అనధికార లేఔట్లకు విద్యుత్ సౌకర్యం తొలగించేలా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసి ఉందని, నగరపాలక సంస్థ నుంచి నిర్మాణ అనుమతులు మంజూరు కాక యాజమాన్యపు హక్కును సైతం శాశ్వతంగా పొందలేరని కమిషనర్ సూచించారు.

ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ రామ్మోహన్ రావు, సిటీ ప్లానర్ హిమబిందు, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కనకాద్రి, ఇంజనీరింగ్ విభాగం అధికారులు శేషగిరిరావు, రహంతు జానీ, అనిల్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

పి.ఆర్.ఓ.
నెల్లూరు నగరపాలక సంస్థ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed