కూటమి ప్రభుత్వంతో ప్రతి ఇంట్లో సంతోషం
– ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల హామీల అమలు
– ప్రతి ఒక్కరి ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది
– రూరల్ నియోజకవర్గంలో ఎంపీ వేమిరెడ్డి గారి ఇంటింటి ప్రచారం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుగారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం ప్రతి ఇంట్లో సంతోషం నింపుతోందని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి గారు, టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారితో కలిసి 34వ డివిజన్ ప్రగతి నగర్లో సుపరిపాలనలో తొలి అడుగు.. ఇంటింటికి టిడిపి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పు పెడితే.. వాటన్నింటినీ సరిచేస్తూ.. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా.. ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు. ప్రతి గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలను ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు తొలగించారని పేర్కొన్నారు. రూరల్ నియోజకవర్గంలో ప్రతి చోటా సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేసి ప్రజల మనసు చూరగొన్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని ప్రశంసించారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సఫలీకృతుడయ్యారని అన్నారు. అందరి కోసం మంచి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆకాంక్షించారు.
రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ప్రతి ఒక్క నాయకుడు ప్రజల మధ్య ఉన్నారని అన్నారు. 3వ రోజు ప్రగతి నగర్లో ప్రచారం నిర్వహిస్తున్నామని చెప్పారు. అన్ని చోట్లా ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, అభివృద్ధి పనులు వేగవంతం అవుతున్నాయని ప్రజలు సంతోషంగా చెబుతున్నారన్నారు. ప్రజా నమ్మకాన్ని నిలబెట్టుకునేలా మరింత ముందుకు సాగుతామని ఆయన వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జులు షంషుద్దీన్, సాబీర్ ఖాన్, కో క్లస్టర్ ఇంచార్జ్ చిలకూరి లక్ష్మిరెడ్డి, 34వ డివిజన్ అధ్యక్షులు షేక్ మస్తాన్, టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.