*కంటి చూపులేని కళ్ళకు వెలుగు రేఖ విపిఆర్ నేత్ర*

– అఖండ ప్రజాశీసుల మధ్య వైభవంగా ప్రారంభమైన *విపిఆర్ నేత్ర* యాత్ర
– ప్రారంభించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రశాంతమ్మ, కాకర్ల సురేష్‌

– ఉదయగిరి ప్రాంత ఆరాద్య దైవం ప్రభాకర్‌రెడ్డి
– అరగంటలోనే కంటి అద్దాలు ఇచ్చేలా ఏర్పాట్లు
– హర్షం వ్యక్తం చేస్తున్న పెద్దలు, మహిళలు
– మా కంటికి ఇన్నేళ్లకు వెలుగొచ్చిందని సంబరాలు

*చూపు సన్నగిల్లిన బ్రతుకుల్లో ఆశలు చిగురించిన వేళ.. కళ్ళున్నా చూడలేని జీవితాల్లో వెలుగులు నిండిన వేళ.. ప్రజాకాంక్షను మోస్తూ వారి ఆకాంక్షలు నెరవేరుస్తూ కదిలిచ్చిందో రథం. బడుగు జీవులకు నేనున్నానంటూ చూపించిందో పథం..*

పేదల పెన్నిధిగా, అభాగ్యులకు అండగా.. నిరంతర శ్రామికుడిగా.. సేవకు నిలువెత్తు రూపంగా నిలిచే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. తన అమృత హస్తాలతో ప్రారంభించిన విపిఆర్ నేత్ర యాత్ర ఎంతోమందికి చూపునిచ్చేందుకు, దారి చూపేందుకు సిద్ధమైంది. అఖండ ప్రజాశీసుల మధ్య రామాపురం గ్రామంలో వేడుకగా ప్రారంభమైంది.

నీరింకిన కళ్ళకు కంటి వెలుగై.. బరువెక్కిన గుండెలకు ఆపద్బాంధవుడై.. ప్రజా సేవలో మేరు పర్వతమైన నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన సతీమణి కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి గారు, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు.. విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన విపిఆర్ నేత్ర కార్యక్రమాన్ని సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా గ్రామానికి చేరుకున్న వేమిరెడ్డి దంపతులకు, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారికి గ్రామస్తులు, నాయకులు భారీ గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన విపిఆర్ నేత్ర బస్సును రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కంటిచూపు సరిగా లేని పలువురికి వైద్య సిబ్బంది కంటి పరీక్షలు చేసి అక్కడికక్కడే కంటి అద్దాలు అందజేశారు. వందలాదిమంది వృద్ధులు, మహిళలు, పెద్దవారు కంటి పరీక్షలు చేయించుకుని , ఇన్నాళ్లకు తమ చూపు స్పష్టంగా ఉందంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మురిసిపోయారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై నుంచి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తన ప్రసంగాన్ని అందించారు. తనను కలిసిన ఒక వృద్ధుడి అవస్థ నుంచి పుట్టిన కార్యక్రమమే విపిఆర్‌ నేత్ర అని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కంటి సమస్యలపై అవగాహన లేక ఎంతో మంది తమ చూపును నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఇప్పటికే గ్రామస్థులకు తాగడానికి నీరు, దివ్యాంగులు ఆత్మ ధైర్యంతో బతికేందుకు ట్రై సైకిల్స్, పేద పిల్లలు చదువుకునేందుకు విపిఆర్ విద్య వంటివి ఏర్పాటు చేశామన్నారు. జిల్లా ప్రజలకు ఇంకా ఏదో చేయాలన్న తపన నుంచి విపిఆర్ నేత్ర కార్యక్రమానికి రూపకల్పన చేశామన్నారు.

మానవ శరీరంలో కళ్ళు అతి ముఖ్యమైనవని, కంటి చూపు లేకుంటే జీవితం అంధకారమేనన్నారు. అంతటి ముఖ్యమైన నేత్రాలతో ఈ అందమైన ప్రపంచాన్ని చూపించేందుకు విపిఆర్ నేత్ర తోడు ఉంటుందని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు గారు రాష్ట్ర ప్రజలను తన సొంత బిడ్డలుగా చూసుకుంటున్నారని, ప్రతి నియోజకవర్గంలో 5 నుంచి 6 కోట్ల వరకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నారన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని జిల్లా వ్యాప్తంగా విపిఆర్ నేత్ర కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. అందులో భాగంగా తనకు ఎంతో ఇష్టమైన ఉదయగిరి ప్రాంతం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఉదయగిరి ప్రాంతమన్నా, ఇక్కడి ప్రజలన్నా తనకు ఎంతో అభిమానమని ఆయన చెప్పారు.

ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మద్దతు లేకపోతే ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ప్రారంభించలేమన్నారు. అలాగే తనతో గత 2 నెలలుగా ప్రయాణం చేస్తున్న డాక్టర్‌ కృష్ణ ప్రసాద్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. స్థానిక నాయకుల మద్దతు ఈ కార్యక్రమ విజయవంతంలో ఎంతో ఉంటుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తనకు తమ్ముడి లాంటి వారని, నిరంతరం ప్రజల గురించి ఆలోచిస్తూ పనిచేస్తున్నారన్నారు. ఆయనతో కలిసి ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం సంతోషంగా ఉందన్నారు.

ఎంతో ఉన్నత ఆశయంతో చేపట్టిన విపిఆర్‌ నేత్ర కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా ప్రతి నాయకుడు, కార్యకర్త పనిచేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ విపిఆర్ నేత్రలో భాగస్వాములు కావాలని కోరారు. ఉదయగిరి ప్రజల ఆకాంక్ష అయిన సోమశిల హైలెవెల్‌ కెనాల్‌ పూర్తి, వెలుగొండ ప్రాజెక్టు నుంచి నీటిని తెచ్చే బాధ్యతను తాము తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఉదయగిరి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, మాజీ జడ్పి ఛైర్మన్ చెంచలబాబు బాబు యాదవ్, డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌ యాదవ్‌, కేతంరెడ్డి వినోద్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యులు నాగేంద్ర, స్థానిక నాయకులు చండ్ర మధుసూదన రావు, ఇతర నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed