
ఓటరు నమోదు నిరంతర ప్రక్రియను సద్వినియోగం చేసుకోండి
– ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి వై.ఓ నందన్
ఎన్నికల సంఘం సూచనల మేరకు నగర నియోజకవర్గం 117 పరిధిలో ఓటర్ నమోదు నిరంతర ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని నియోజకవర్గం ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి వై.ఓ నందన్ తెలిపారు.
కార్పొరేషన్ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ.ఆర్.ఓ మాట్లాడుతూ ప్రధాన ఎన్నికల అధికారి సూచనల మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చించి వివిధ అంశాలపై తగిన చర్యలు తీసుకోవడానికి సమావేశం నిర్వహించినట్లు తెలియజేశారు.
నూతన ఓటర్ల నమోదు కోసం నియోజకవర్గ పరిధిలోని డిగ్రీ స్థాయి కళాశాలల్లో ఓటరుగా అర్హులైన విద్యార్థులందరికీ అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
SSR-2025కి సంబంధించి పార్టీల ప్రతినిధులు లేవనెత్తిన క్లెయిమ్‌లు, అభ్యంతరాలపై పరిష్కారం అందించామని తెలిపారు.
పోలింగ్ స్టేషన్లలో 800 నుండి 1200 మంది ఓటర్లు ఉండేలా, ప్రతి ఓటరు వారి నివాసానికి 2 కి.మీ.లోపు ఉండేలా పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయబడతాయని ఈ.ఆర్.ఓ వివరించారు.
ఓటరు జాబితాలో ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు ఒకే క్రమంలో ఉండేలా చూడాలని, గత ఎన్నికలలో చట్టాల ఉల్లంఘనకు పాల్పడిన వారికి పార్టీల బూత్ ఇన్చార్జిలుగా లేదా ఇతర సిబ్బందిగా అవకాశము కల్పించకుండా చూడాలని రాజకీయ పార్టీల ప్రతినిధులు కోరారు.
నియోజకవర్గంలో రాజకీయాల ద్వారా నియమించబడిన బి.ఎల్.ఎలు తమ సంబంధిత బి.ఎల్.ఓలకు అందుబాటులో ఉండాలని, సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు సంబంధిత పోలింగ్ స్టేషన్‌ల జాబితాలలో సహాయం అందించాలని సూచించారు. అలాగే నియోజకవర్గంలోని బీ.ఎల్.వోలందరికీ శిక్షణా సమావేశాలు నిర్వహించనున్నామని తెలిపారు.
ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, 117- నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గ అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ షఫీ మాలిక్, నెల్లూరు అర్బన్ ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్ ఆనంద్ రావు, నెల్లూరు నగర పాలక సంస్థ ఎన్నికల విభాగం సూపర్ ఇంటెండెంట్ పద్మావతి, చక్రపాణి పాల్గొన్నారు.