ఏపీలో రూ.6,700 కోట్ల పండగ బెనిఫిట్: ఉద్యోగులు, అమరావతి రైతులకూ గిఫ్ట్
Chandrababu: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. తెలుగు లోగిళ్లల్లో సంక్రాంతి పండగ సందడి నెలకొంటోంది. ఇంటి ముందు రంగవల్లులు, కోడిపందేలు, గంగిరెద్దుల ఆటలతో వారం రోజుల పాటు ఏపీ, తెలంగాణల్లో పండగ కోలాహలం ఏర్పడుతోంది.
సంక్రాంతి కానుకగా..
సంక్రాంతి ముంగిట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పండగ కానుకను ప్రకటించారు. దీని విలువ 6,700 కోట్ల రూపాయలు. వివిధ మంత్రిత్వ శాఖలకు ఇన్నాళ్లూ పెండింగ్లో ఉంటూ వచ్చిన బిల్లుల మొత్తం అది. దీన్ని వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. నేటి నుంచి ఆ మొత్తం ఆయా ఆయా శాఖల ఖాతాల్లో జమ అవుతుందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు.
చంద్రబాబు సమీక్ష..
శనివారం రాత్రి ఉండవల్లి నివాసంలో ఆర్థిక శాఖపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆర్థిక శాఖ స్థితిగతులు, పెండింగ్ బిల్లుల విడుదలపై ప్రధానంగా ఈ సమీక్ష సాగింది. ఎంత మేర బిల్లులు పెండింగ్లో ఉన్నాయనే అంశంపై చర్చించారు. శాఖలవారీగా వాటికి సంబంధించిన ప్రతిపాదనలను తెప్పించుకున్నారు. వాటిపై చర్చించారు.
బిల్లులు క్లియర్..
ఆయా మంత్రత్వ శాఖలు, వర్గాలకు కలిపి మొత్తం 6,700 కోట్ల రూపాయల మేర బిల్లులు పెండింగ్లో ఉన్నట్లు అధికారులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, విద్యార్థులు, చిన్న కాంట్రాక్టర్ల బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.
ఉద్యోగులకు
ఉద్యోగులకు జీపీఎఫ్, సరెండర్ లీవులు, సీపీఎస్ కంట్రిబ్యూషన్ కలిపి మొత్తం 1,300 కోట్ల రూపాయలు. ఉద్యోగులకు 519 కోట్ల రూపాయల జీపిఎఫ్ నిధులు విడుదల. పోలీసుశాఖకు సంబంధించి నాలుగు సరెండర్ లీవుల పెండింగ్, పోలీసులకు ఒక ఇన్స్టాల్మెంట్ సరెండర్ లీవులకు మొత్తం 214 కోట్ల రూపాయలు విడుదల. దీనివల్ల 54,900 మంది పోలీసులకు లబ్ది కలిగినట్టయింది.
సీపీఎస్ కంట్రిబ్యూషన్ నిధులు..
ఒక నెలకు సంబంధించిన సీపీఎస్ కంట్రిబ్యూషన్ నిధులు విడుదలకు చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. దీని విలువ 300 కోట్ల రూపాయలు. సీఎస్ఎస్ కింద మరో 627 కోట్ల రూపాయలను విడుదల చేయాలని ఆయన సూచించారు. టీడీఎస్ చెల్లింపుల కింద 265 కోట్ల రూపాయల మొత్తం కూడా విడుదల అయింది.
కౌలు మొత్తం..
అమరావతి రాజధాని, గన్నవరం ఎయిర్పోర్ట్కు భూములు ఇచ్చిన రైతులకు 244 కోట్ల రూపాయల కౌలు మొత్తం చెల్లింపునకూ చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ మొత్తాన్ని కూడా విడుదల చేసినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్, ఆసుపత్రులకు చెల్లించడానికి ఉద్దేశించిన రూ.400 కోట్లు, డ్రగ్స్, మెడిసిన్స్కు మరో 100 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలు విడుదల అయ్యాయి
పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్..
విద్యార్థులకు సంబంధించిన పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కింద 788 కోట్ల రూపాయలను చంద్రబాబు విడుదల చేశారు. దీనివల్ల ఆరున్నర లక్షల మంది విద్యార్థులకు లబ్ది కలుగుతుంది. ప్రభుత్వ కాంట్రాక్టు పనులకు సంబంధించి 10 లక్షల రూపాయల లోపు ఉన్న అన్ని బిల్లులు రిలీజ్ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. దీని కింద 506 కోట్ల రూపాయల విడుదలకు ఆదేశాలు ఇచ్చారు.
ఎంఎస్ఎంఈ , డిస్కంలకు..
దీనివల్ల 26,000 మంది కాంట్రాక్టర్లకు లబ్ది కలుగుతుంది. వీరితో పాటు భూసేకరణ లబ్దిదారులు కూడా నిథులు విడుదలకు ఆదేశాలు అందాయి. ఎంఎస్ఎంఈ రూ. 90 కోట్లు. డిస్కంలకు రూ. 500 కోట్లు, ప్రభుత్వంలో వివిధ శాఖల్లో నిర్వహణా బిల్లులు రూ. 366 కోట్ల రూపాయల బిల్లులు క్లియర్ అయ్యాయి.
(జన హుషార్ న్యూస్)