*IFFCO కిసాన్ సెజ్ అభివృద్ధికి కీలక అడుగులు*
*IFFCO ఛైర్మన్, సీఈవోను కలిసిన ఎంపీ వేమిరెడ్డి*
– 2777 ఎకరాలున్న సెజ్‌లో కంపెనీల ఏర్పాటుపై సుధీర్ఘ చర్చ
– సమగ్ర వివరాలు అందించిన ఎంపీ
– పరిశ్రమలు ఏర్పడితే వేలాదిమంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు
– సానుకూలంగా స్పందించిన IFFCO ఛైర్మన్, సీఈవో,
జిల్లాకు తలమానికమైన ఇఫ్కో(IFFCO) కిసాన్ సెజ్ అభివృద్ధిలో కీలక ముందడుగు పడింది. జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యంగా, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలే ధ్యేయంగా ముందుకు సాగుతున్న నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు.. ఇఫ్కో కిసాన్ సెజ్ లో పరిశ్రమలు తెచ్చేలా ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో ఇఫ్కో కిసాన్ సెజ్ ఛైర్మన్ దిలీప్ సంఘాని, ఇఫ్కో సీఈవో డా. ఉదయ్ శంకర్ అవస్థిని ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని IFFCO కిసాన్ సెజ్ కోసం సేకరించిన 2777 ఎకరాల్లో అభివృద్ధి కార్యకలాపాలను చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం భూమిలో 1900 ఎకరాలు సెజ్ నిమిత్తం, 877 ఎకరాలు డొమెస్టిక్ టారిఫ్ ఏరియా కింద ఉందన్నారు.
ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ (IFFCO) ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన సహకార సంస్థ అని, వ్యవసాయం, ఇతర పారిశ్రామిక యూనిట్లకు ప్రాధాన్యతనిస్తూ పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఎంతో ఉపకరిస్తుందని ఎంపీ వేమిరెడ్డి చెప్పారు. పరిశ్రమలను ప్రోత్సహించడానికి మెరుగైన నిర్వహణ దృష్టి కోసం IKSEZను IFFCO ప్రోత్సహిస్తుందన్నారు.
స్పెషల్ ఎకనమిక్ జోన్ చట్టం, 2005 ప్రకారం నెల్లూరులో 2009లో బహుళ-ఉత్పత్తి ‘కిసాన్ SEZ’ ఏర్పాటు అయిందన్నారు. ఇఫ్కోలో పరిశ్రమలకు ప్రధాన అవసరాలైన విద్యుత్, నీరు, భద్రత వంటి వసతులు కల్పించేందుకు రూ. 300 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాలు కల్పించారన్నారు. ప్రస్తుతం ఇఫ్కో కిసాన్ సెజ్‌లో విద్యుత్ సరఫరా, కాంపౌండ్ వాల్, నీరు, మురుగునీటి శుద్ధి కర్మాగారం(STP), అంతర్గత రోడ్లు, తుఫాను నీటి పారుదల వ్యవస్థ, 24 గంటల భద్రత, ప్లగ్ మరియు ప్లే సౌకర్యాలతో పాటు 34,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉపయోగానికి అనువుగా ఉన్న కార్యాలయ స్థలం వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్నారు.
ప్రస్తుతం ఇఫ్కో కిసాన్ సెజ్‌లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన సిమెన్స్ గమేసా రెన్యూవబుల్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్, 2017లో ఏర్పాటై 150 ఎకరాల్లో కార్యకలాపాలు సాగిస్తోందన్నారు. అదేవిధంగా హిందుస్తాన్ కోకా కోలా బెవరేజెస్ లిమిటెడ్ (HCCB), తమ యూనిట్ల కోసం 150 ఎకరాలను తీసుకుందని, దీంతోపాటు ఇతర పెట్టుబడిదారులు కంపెనీలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని వారి దృష్టికి తెచ్చారు.
జిల్లాలో నైపుణ్యాలున్న యువతకు కొరత లేదని, ఇఫ్కో సెజ్‌లో పరిశ్రమలు ఏర్పాటయితే.. జిల్లాలో వేలాదిమంది యువతకు ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని ఆయన పేర్కొన్నారు. స్థానికులకు ఉపాధి మెరుగుపడుతుందని వివరించారు. తద్వారా జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెంది ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
కాబట్టి ఇఫ్కో సెజ్‌లో తగిన ప్రాజెక్టులు ఏర్పాటు అయ్యేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన అభ్యర్థించారు. ఎంపీ వేమిరెడ్డి విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన వారు.. ఇఫ్కో కిసాన్ సెజ్ లో పరిస్థితిని పరిశీలిస్తామన్నారు. తప్పకుండా సెజ్ భూములను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.