_*వి ఎస్ యూ లో అనుబంధ కళాశాలల కరస్పాండెంట్స్ ప్రిన్సిపాల్‌లతో సమీక్షా సమావేశం…*_
……………
నెల్లూరు జిల్లా కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం లో CDC విభాగం ఆధ్వర్యంలో అనుబంధ కళాశాలల ప్రిన్సిపాల్‌లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సమావేశంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ కె.సునీత , పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఆర్.మధుమతి, డీన్ CDC డాక్టర్ యం. హుస్సేనయ్య పాల్గొన్నారు.

అనుబంధ కళాశాలల ప్రిన్సిపాల్‌లు, విద్య ప్రమాణాల మెరుగుదల, విద్యార్థుల ప్రగతి, పరీక్షల నిర్వహణ, అధ్యాపకుల శిక్షణ వంటి అంశాలపై విశ్లేషణాత్మకంగా చర్చించారు. ఈ సందర్భంగా ఉపకులపతి ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ, “అనుబంధ కళాశాలలు విశ్వవిద్యాలయ ప్రతిష్ఠకు మద్దతుగా ఉండే విధంగా నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత కలిగి ఉన్నాయి. ప్రతి కళాశాలలో విద్యా ప్రమాణాలను పటిష్టంగా అమలు చేయాలని, పాఠ్యపద్ధతులనూ సాంకేతికంగా నవీకరించాల్సిన అవసరం ఉంది” అని పేర్కొన్నారు. అలాగే, విద్యార్థుల ఉపాధి అవకాశాల మెరుగుదల, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, పరిశోధనా అభిరుచి పెంపు వంటి అంశాలపైనా ఉపకులపతి గారు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ సమావేశం ద్వారా విశ్వవిద్యాలయం మరియు అనుబంధ కళాశాలల మధ్య సమన్వయాన్ని బలపరిచే దిశగా నిర్ణయాలు తీసుకోవడంతో పాటు, భవిష్యత్ లో విద్యా ప్రమాణాల పెంపు కోసం కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు.

రిజిస్ట్రార్ డాక్టర్ కె సునీత మాట్లాడుతూ, “అనుబంధ కళాశాలల పరిపాలనలో పారదర్శకత, సమర్థత కీలకం. కాలక్రమేణా విద్యా విధానాల్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా కళాశాలలు అభివృద్ధి చేసుకోవాలి. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో, పాఠ్యాంశాల అమలు, అధ్యాపకుల పాత్ర, మౌలిక సదుపాయాల వినియోగంపై కఠినంగా నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది” అని వివరించారు.

కళాశాలల నిర్వహణలో ఆచరణాత్మక చర్యలు తీసుకోవడానికి విశ్వవిద్యాలయం అన్ని విధాలా సహకారం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. మానవ వనరుల అభివృద్ధికి సంబంధించిన సూచనలు, నిబంధనలు, మరియు విధానాలపై స్పష్టమైన మార్గదర్శకాలను ఇవ్వడానికి విశ్వవిద్యాలయం సిద్ధంగా ఉందని తెలిపారు.

పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఆర్ మధుమతి మాట్లాడుతూ “పరీక్షల నిర్వహణలో విశ్వసనీయత మరియు పారదర్శకత అత్యంత కీలకం. అనుబంధ కళాశాలలు పరీక్షల షెడ్యూల్, ఇంటర్నల్ పరీక్షల నిర్వహణ, ఫలితాల సమయానుసార విడుదల వంటి అంశాల్లో నిర్దిష్ట మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది” అని పేర్కొన్నారు. అలాగే, విద్యార్థుల అర్హత, హాజరు శాతం, ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ వంటి అంశాలలో ఎలాంటి జాప్యం లేకుండా నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలన్నారు. “విద్యార్థుల భవిష్యత్తు పరీక్షల పద్ధతులపై ఆధారపడి ఉంటుంది కనుక, ప్రతి కళాశాల ఈ ప్రక్రియను అత్యంత ప్రాముఖ్యతతో స్వీకరించాలి” హితవు పలికారు.

డాక్టర్ యం. హుస్సేనయ్య డీన్ CDC మాట్లాడుతూ, “అనుబంధ కళాశాలల పనితీరును నిరంతరం పర్యవేక్షించడమే మా ప్రధాన బాధ్యత. ప్రతి కళాశాల నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ, అధ్యాపకుల అర్హత, మౌలిక వసతులు, విద్యార్థుల శిక్షణా కార్యక్రమాలు వంటి అంశాల్లో నిర్దిష్ట ప్రమాణాలను అనుసరించాలి” అని పేర్కొన్నారు.

అలాగే, మౌలిక వసతులు, అధ్యాపకుల విద్యార్హతలు, తరగతి గదుల వినియోగం తదితర అంశాల్లో నిబంధనలకు అనుగుణంగా ఉండలిని అని తెలిపారు.

అనంతరం అనుబంధ కళాశాలల ప్రిన్సిపల్స్ మాట్లాడుతూ
విశ్వవిద్యాలయ అభివృద్ధిలో భాగస్వాములమవుతామని, విశ్వవిద్యాలయానికి అవసరమైన అన్ని విధాల సహకారాన్ని అందిస్తామని తెలిపారు.
అనంతరం అనుబంధ కళాశాలల కరస్పాండెంట్స్ ప్రిన్సిపాల్స్ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు గారిని పూల బొకే ఇచ్చి శాల్వాలతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో వి ఎస్ యూ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యం.హనుమారెడ్డి, డాక్టర్ ఉదయ శంకర్ అల్లం, సహాయక రిజిస్ట్రార్ డాక్టర్ జి సుజయ్ కుమార్, మరియు అనుబంధ కళాశాలల కరస్పాండెంట్స్ ప్రిన్సిపాల్స్ పాల్గొనారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed