పత్రికా ప్రకటన
నెల్లూరు, డిసెంబర్ 31 :
నెల్లూరు నగరంలోని సర్వేపల్లి కాలువ, జాఫర్ కాలువ గట్టులపై ఉన్న పేదలఇళ్లను ఎటువంటి పరిస్థితిలో తొలగించబోమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు.
మంగళవారం ఉదయం నగరంలోని 16వ డివిజన్లోని గుర్రాల మడుగు సంఘం ప్రాంతంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో నుడా చైర్మన్ శ్రీనివాసుల రెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్, నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ లతో కలిసి మంత్రి నారాయణ పాల్గొని పింఛన్లు పంపిణీచేసారు.
ఈ సందర్భంగా మీడియానుద్దేశించి మంత్రి నారాయణ మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితులను ఒక్కొక్కటిగా చక్కదిద్దుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం ను ప్రజలకు అందిస్తుందన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం 64 లక్షల మందికి పెన్షన్లను అందజేయుటకు సంవత్సరానికి 32 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. అదే సమయంలో రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు వివిధ రకాల పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రతి జిల్లాకు పరిశ్రమలను తీసుకువస్తామన్నారు. పరిశ్రమలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, ఆయా ప్రాంతాల యువతీ యువకులకు ఉద్యోగాలు వచ్చి వారి ఆర్థిక స్థితి మెరుగుపడటమే కాకుండా రాష్ట్రం ఆర్థికంగా కుదుటపడుతుందన్నారు. ప్రజలకిచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. నెల్లూరు నగర పరిధిలో 46,383 మందికి పెన్షన్లు అందజేస్తున్నామన్నారు. గతానికి ఇప్పటికీ గణనీయంగా వచ్చిన మార్పును ప్రజలందరూ చూస్తున్నారన్నారు. నగరంలో పెండింగ్ లో ఉన్న భూగర్భ డ్రైనేజీ, మంచినీటి వసతి సౌకర్యాలను తొందర్లోనే పూర్తి చేస్తామన్నారు. నగరంలోని సర్వేపల్లి కాలువ, జాఫర్ కాలువ గట్టులపై ఉన్న పేదలఇళ్లను ఎటువంటి పరిస్థితుల్లో తొలగించమని, పేదఇంటి నుండి ఈ స్థాయికి వచ్చిన తనకు వారి సాధక భాదలు పూర్తిగా తెలుసునన్నారు. కొందరు చేస్తున్న ఇటువంటి అసత్య ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని ప్రజలను కోరారు.