కోల్‌కతా:
*ఇండియా కూటమి విచ్ఛిన్నానికి కౌంట్‌డౌన్ మొదలైంది: నరేంద్ర మోడీ*
ఇండియా కూటమి విచ్ఛిన్నానికి కౌంట్‌డౌన్ మొదలైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అయిదో విడత పోలింగ్ అనంతరం ఆ కూటమి ఓటమి ఖాయమైందన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లోని ఝాడ్‌గ్రామ్‌లో నిర్వహించిన ప్రచార సభలో మోదీ పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ , టీఎంసీ లు మునుగుతోన్న పడవలని ఎద్దేవా చేశారు. ప్రపంచ దేశాలు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న సమయంలో.. కుంభకోణాల రికార్డులు సృష్టించడంలో కాంగ్రెస్ నిమగ్నమైందని విమర్శించారు.
హస్తం పార్టీ మతతత్వ రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించిన మోదీ.. ఓటుబ్యాంకు వర్గాల కోసం ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను లాక్కోవాలని చూస్తోందన్నారు. జూన్ 4న ఎన్నికల ఫలితాల అనంతరం ప్రతిపక్ష కూటమి తన ఉనికి కోల్పోతుందని చెప్పారు. జల్‌పాయిగుడీలోని రామకృష్ణ మిషన్ ఆశ్రమంపై జరిగిన దాడిని ఖండిస్తూ.. టీఎంసీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. సీఎం మమతా బెనర్జీ స్వయంగా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అనంతరం మోదీ తమ్లుక్‌లో ప్రచార సభకు వెళ్లాల్సింది. కానీ, ప్రతికూల వాతావరణంతో హెలికాప్టర్ ల్యాండింగ్‌లో సమస్య కారణంగా ఝాడ్‌గ్రామ్ నుంచే వర్చువల్‌గా ప్రసంగించారు.