*మత్స్యకార గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దేందుకు మత్స్యకారులను రాష్ట్ర ప్రభుత్వం తరపున చర్చలకు ఆహ్వానిస్తున్నామని, లేదా వారు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం*

నెల్లూరు, (జన హుషార్) మార్చి 24 : రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ మత్స్యకారుల పక్షమేనని, వారు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం పూర్తిగా వారికి అండగా నిలుస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ గనులుశాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.

మంగళవారం ఉదయం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో సముద్రంలో చేపలవేటకు అక్రమబోట్ల ప్రవేశం పూర్తిగా నివారించడం, జువ్వలదిన్నె మత్స్యకారుల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన కమిటీ సభ్యులు మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు, మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య కలెక్టర్ హిమాన్షు శుక్ల అధ్యక్షతన ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో మంత్రులు కొల్లు రవీంద్ర, ఎన్ఎండి ఫరూక్, ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్సీలు బీద రవిచంద్ర, బల్లి కల్యాణ్‌చక్రవర్తి, రాంగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, దగుమాటి వెంకట కృష్ణారెడ్డి, నెలవల విజయశ్రీ, పాశం సునీల్‌కుమార్, ఐజి సర్వశ్రేష్ట త్రిపాటి, ఎస్పీ డా.అజితా వెజండ్ల, ఫిషరీస్ కమిషనర్ రామ్ శంకర్ నాయక్ హాజరయ్యారు.

మన తీరంలో చేపలవేటకు అక్రమంగా తమిళనాడు, పాండిచ్చేరి బోట్ల ప్రవేశాన్ని పూర్తిగా అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు, మత్స్యకారుల భద్రత, భరోసా మొదలైన అంశాలపై కమిటీ సభ్యులు ప్రజాప్రతినిధులతో చర్చించారు. సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన పలు అంశాలను ప్రజాప్రతినిధులు కమిటీ సభ్యులు, మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.

అనంతరం రాష్ట్ర ఎక్సైజ్ గనులశాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాత్రికేయులతో మాట్లాడుతూ ఇటీవల జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ లో 8నెలలుగా మత్స్యకారుల ఆధీనంలో వున్న పాండిచ్చేరికి చెందిన నాలుగు బోట్లను గుర్తుతెలియని వారు తీసుకెళ్లారని, దీంతో మత్స్యకారులు ఆవేదనతో వున్నట్లు చెప్పారు. ఈ విషయమై తీర ప్రాంతాల్లోని మత్స్యకార గ్రామాల్లో మత్స్యకారులు ఆందోళనతో ఉన్నట్లు చెప్పారు. గత 20 సంవత్సరాలుగా తమిళనాడు, పాండిచ్చేరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఈ బోట్ల సమస్య వుందని చెప్పారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామన్నారు.

ఇప్పటికే తమిళనాడు బోట్ల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు. ఇందులో భాగంగా టాస్క్ ఫోర్స్ బృందంతో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ తీరంలో మెకనైజ్డ్ బోటుతో గస్తీని ముమ్మరం చేసినట్లు చెప్పారు. వేట నిషేధ సమయం పూర్తయ్యేలోగా మరో రెండు బోట్లను ఏర్పాటుచేస్తామన్నారు. రాష్ట్రంలో 27 మెరైన్ స్టేషన్ల పరిధిలో 18 బోట్లు రిపేర్లకు గురై వున్నాయని, సీఎంతో చర్చించి వీటికి రిపేర్లు చేయించడమా, లేదా కొత్తవి కొనుగోలు చేయడంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సూచించిన మేరకు గస్తీని ముమ్మరం చేయడం, నూతన బోట్లు ఏర్పాటు చేయడం, మెరైన్, కోస్టల్ గార్డ్ వ్యవస్థను పటిష్టం చేయడం మొదలైన అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలను మత్స్యకారులకు సంపూర్ణంగా అందించి వారి జీవనప్రమాణాలు మెరుగుపరుస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం తరపున ఒక్కొక్క మత్స్యకారునికి 20వేలు చొప్పున 1.20 లక్షలమందికి సాయం అందించామని, 50ఏళ్లు వయస్సున్న వారికి పింఛన్లు అందిస్తున్నట్లు చెప్పారు. రాయితీపై మెకనైజ్డ్ బోట్లను ఇప్పించేందుకు చర్యలు చేపట్టామన్నారు.

ప్రస్తుతం మత్స్యకార గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దేందుకు మత్స్యకారులను రాష్ట్ర ప్రభుత్వం తరపున చర్చలకు ఆహ్వానిస్తున్నామని, లేదా వారు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.

కొంతమంది కావాలని మత్స్యకారులను రెచ్చగొడుతూ గొడవలు సృష్టించాలని చూస్తున్నారని, తమ ప్రభుత్వానికి మొదటి నుంచి కూడా మత్స్యకారులు అండగా నిలుస్తున్నారని, వారి సంక్షేమం, భద్రతకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి పునరుద్ఘాటించారు.

ఈ సమావేశంలో ఏఎస్పీలు దీక్ష, సౌజన్య, మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ శాంతి, ఏడి చాంద్ బాషా, డీఎస్పీలు, మెరైన్ పోలీసులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed