
*ఆంధ్రప్రదేశ్లో విమానాశ్రయాల ఉపాధి సామర్థ్యంపై రాజ్యసభలో ప్రశ్నించిన బీద మస్తాన్ రావు యాదవ్*
న్యూఢిల్లీ, డిసెంబర్ 8, 2025:
👉 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించిన విమానాశ్రయాలు మరియు రాబోయే కొత్త విమానాశ్రయ ప్రాజెక్టులు సృష్టించే ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలపై వివరాలు తెలియజేయాలని కోరుతూ రాజ్యసభ సభ్యుడు శ్రీ బీద మస్తాన్ రావు యాదవ్ గారు ఈ రోజు రాజ్యసభలో ప్రశ్నించారు.
👉 కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి శ్రి మురళీధర్ మొహోల్ గారు, దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు ఆర్థిక కార్యకలాపాల కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయని, వీటి వల్ల రాష్ట్రాల్లో పర్యాటకం, పెట్టుబడులు, వ్యాపార రవాణా, భూవిలువలు పెరగడంతో పాటు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు.
👉 అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO) అధ్యయనాన్ని ప్రస్తావిస్తూ, ఎయిర్ కనెక్టివిటీకి 3.25 ఆర్థిక మల్టీప్లయర్, 6.1 ఉపాధి మల్టీప్లయర్ ఉన్నట్లు పేర్కొన్నారు. అంటే, ఒక ప్రాంతంలో విమానాశ్రయం అభివృద్ధి జరిగితే ఆ ప్రాంత ఆర్థిక వ్యవస్థలో మూడు రెట్లు పైగా పురోగతి, అలాగే ఆరు రెట్లు పైగా ఉపాధి సృష్టి సంభవిస్తుందని తెలిపారు. అయితే, రాష్ట్రాల వారీగా ప్రత్యేకంగా ఉపాధి అంచనాలు లేదా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు మంత్రిత్వ శాఖ వద్ద లేవని ప్రకటించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా విమానయాన నైపుణ్యాలపై శిక్షణా భాగస్వామ్యాలు లేదా కేంద్ర ప్రాయోజిత ప్రత్యేక కార్యక్రమాలు లేవని కూడా సమాధానంలో స్పష్టం చేశారు.
👉 ఈ సందర్భంగా శ్రీ బీద మస్తాన్ రావు యాదవ్ గారు మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్లో పెరుగుతున్న విమానాశ్రయాల సంఖ్య రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి, ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాల పెరుగుదలకు ఎంతో ఉపయుక్తమవుతోంది. ICAO మల్టీప్లయర్ల ప్రకారం విమానాశ్రయ ప్రాజెక్టులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల్లో వేగంగా ఉపాధి సృష్టించే సామర్థ్యం కలిగి ఉన్నాయి. రాబోయే సంవత్సరాల్లో కొత్త ఎయిర్పోర్టుల అభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలో స్థానిక యువతకు స్కిల్ ట్రైనింగ్ కల్పించడం అత్యంత కీలకం’’ అని పేర్కొన్నారు.
— శ్రీ బీద మస్తాన్ రావు యాదవ్ గారి కార్యాలయం, నెల్లూరు