*మే 13న పోలింగ్‌కు పూర్తిస్థాయిలో సన్నద్ధం కండి
– పొరపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలి : జిల్లా కలెక్టర్*
– పోలింగ్‌కేంద్రాల్లో ఓటర్లకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి
– ఎన్నికల సంఘం నిబంధనలు తప్పకుండా అమలుచేయాలి
– నూరుశాతం పారదర్శకంగా, స్వేచ్ఛగా ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయాలి
– బాధ్యతగా, అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలి
– జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరినారాయణన్
నెల్లూరు, మే 8 : మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని రిటర్నింగ్ అధికారులకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం హరినారాయణన్ సూచించారు.
బుధవారం ఉదయం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణం నుంచి మే 13న జరగనున్న పోలింగ్ ఏర్పాట్లపై వీడియోకాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలక ఘట్టమైన పోలింగ్ ప్రక్రియను ఎటువంటి లోటుపాట్లు లేకుండా సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సకాలంలో చేపట్టాలన్నారు. స్వేచ్చగా,శాంతి యుతంగా పోలింగ్ జరిగే విధంగా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. పోలింగ్ అధికారులను పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లేందుకు ఈనెల 12వ తేదీ ఉదయం 6 గంటలకు 255 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే 13వ తేదీ రాత్రి తిరుగు ప్రయాణానికి బస్సులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎంపిక చేసిన రూట్‌మ్యాప్ ప్రకారమే బస్సులను నడిపించాలన్నారు. జీపీఎస్ ఉన్న వాహనాల్లోనే ఈవీఎంలు తరలించాలన్నారు.వాహనాలకు ఇబ్బందులు లేకుండా రిజర్వులో మరికొన్ని వాహనాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అలాగే పోలింగ్ రోజున 85 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, దివ్యాంగుల కోసం ఆటోలు ఏర్పాటుచేసి పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లాలన్నారు. ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల తరువాత బయటి ప్రాంతాల నుండి వచ్చినవారు ఎవ్వరూ జిల్లాలో ఉండకూడదని, అన్ని లాడ్జిల్లో తనిఖీలు చేపట్టాలన్నారు. 144 సెక్షన్ అమలులో వుంటుందని, జనాలు గుమికూడదని, పోలింగ్ రోజు ఓటరు అసిస్టెంట్ బూత్‌ల వద్ద ఇద్దరు కంటే ఎక్కువమంది ఉండకూడదన్నారు. మీడియా అథంటికేషన్స్ లెటర్స్ ఉన్న వారిని మాత్రమే పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించాలని, ఒకేసారి ఎక్కువమందిని కాకుండా పరిమితి మేరకు పంపాలన్నారు. ఓటింగ్ కంపార్టుమెంటు దగ్గర వీడియోగ్రఫీ, ఫొటోగ్రఫీ తీయకూడదన్నారు. ఎన్నికల నిబంధనల అతిక్రమణపై ఏవైనా ఫిర్యాదులోస్తే వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని, విచారణ జరిపిన తరువాత సమాచారశాఖ ద్వారా పూర్తిస్థాయి ప్రకటన ఇవ్వాలన్నారు. సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేయాలన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు సంబంధించి ఏమైనా కేసులు నమోదై ఉంటే ఆ సమాచారాన్ని పత్రికల ద్వారా ప్రచురించాలని, ఇంకా ప్రచురించని అభ్యర్థులకు నోటీసులు అందించాలని ఆర్వోలను ఆదేశించారు. అభ్యర్థులందరూ ఎన్నికల సంబంధించిన అన్ని రిపోర్టులు ఆలస్యం లేకుండా త్వరితగతిన అందించాలన్నారు. అలాగే ఎలక్షన్ డేటాను చాలా జాగ్రత్తగా భద్రపరచుకోవాలన్నారు. ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫి ఆధారాలను సేకరించి జాగ్రత్త చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో కుర్చీలు, టెంట్లు, మంచినీరు సౌకర్యాలు సమకూర్చాలన్నారు. దివ్యాంగులు, వయోవృద్ధులకు ఇబ్బందులు లేకుండా వీల్‌చైర్స్ ఏర్పాటుచేయాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో రెండు యూత్, రెండు వృద్ధుల, రెండు మోడల్ పోలింగ్ కేంద్రాలను అందంగా ముస్తాబు చేసి ఏర్పాటు చేయాలన్నారు. ఓటర్లను చైతన్యపరిచేలా ఓటరుచైతన్య కార్యక్రమాలు ముమ్మరం చేయాలన్నారు. ఓటరు సమాచార స్లిప్పులను త్వరగా పంపిణీ చేయాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. పోలింగ్రోజుకు ముందు, తర్వాత చేపట్టాల్సిన అన్ని ఏర్పాట్లు లోటుపాట్లు లేకుండా చేపట్టాలన్నారు. భారత ఎన్నికల సంఘం నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ పారదర్శకంగా, స్వేచ్ఛగా, శాంతియుతంగా ఎన్నికల విధులు నిర్వహించాలని అధికారులకు కలెక్టరు దిశానిర్దేశం చేశారు.
ఈ కాన్ఫరెన్స్‌లో డిఆర్వో లవన్న, ట్రైనీ కలెక్టర్ సంజనా సింహ, నోడల్ అధికారులు బాపిరెడ్డి, సాల్మన్ రాజు, చందర్, పద్మావతి, కన్నమనాయుడు, రాజశేఖర్, సదారావు తదితరులు పాల్గొన్నారు.
…………………….