
*తెలుగు భాషా పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: వీసీ ఆచార్య అల్లం శ్రీనివాసరావు*
_వీఎస్‌యూలో ఘనంగా “తెలుగు భాషా పరిరక్షణ, పరిశోధన, పరివ్యాప్తి” జాతీయ సదస్సు_
నెల్లూరు:
విక్రమ సింహాపురి విశ్వవిద్యాలయం (వీఎస్‌యూ) తెలుగు శాఖ, ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో “తెలుగు భాషా పరిరక్షణ, పరిశోధన, పరివ్యాప్తి” అనే అంశంపై జాతీయ సదస్సు బుధవారం విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఘనంగా జరిగింది. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని భారతీయ భాషా సంస్థ (మైసూరు) ఈ కార్యక్రమానికి సహకారం అందించింది.
ఈ సదస్సును ఉద్దేశించి ముఖ్య అతిథిగా పాల్గొన్న వీఎస్‌యూ ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు కీలక ప్రసంగం చేశారు.
“తెలుగు భాష భారతీయ సంస్కృతికి అద్దం పట్టే ప్రాచీన భాష. ఇందులో అపారమైన సాహిత్య వైభవం, భాషాశాస్త్ర పరంపర ఉన్నాయి. ఆధునిక సాంకేతిక యుగంలో భాషా పరిరక్షణ కేవలం పండితుల బాధ్యత కాదు, ప్రతి తెలుగు వారి ధర్మం. మాతృభాషలో ఆలోచించడం మన సృజనాత్మకతకు బలం ఇస్తుంది. భాషను సంరక్షించేందుకు విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, విద్యార్థులు, ప్రజలంతా కలిసికట్టుగా కృషి చేయాలి,”
ప్రాచీన సాహిత్యమే మనకు స్ఫూర్తి
ఈ సదస్సులో తి.తి.దే. అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్, సుప్రసిద్ధ అవధాని డాక్టర్ మేడసాని మోహన్ కీలకోపన్యాసం చేశారు.
“ప్రాచీన సాహిత్యంలో ఎన్నో విషయాలు మన భాషను, దాని పరివ్యాప్తిని ప్రస్ఫుటం చేస్తున్నాయి. ప్రధానంగా మహాభారతం రాసిన నన్నయ, తిక్కన, ఎర్రనలు రాసిన పద్యాలు, వాటి భావాలు, ఆయా సందర్భాలు తెలుగు భాష విస్తృతంగా పరిశోధన మరియు పరివ్యాప్తి కావడానికి ఎంతగానో దోహదం చేశాయి.”
సాహిత్యాన్ని డిజిటల్ యుగానికి అనుసంధానించాలి
అనంతరం విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. కె. సునీత మాట్లాడుతూ, భాషా పరిరక్షణలో సాంకేతికత పాత్రను నొక్కిచెప్పారు.
“తెలుగు భాష మన ఆత్మీయతకు, సంస్కృతికి ప్రతిబింబం. ప్రాచీన సాహిత్య సంపదను నేటి యువతకు పరిచయం చేయడం, దానిని డిజిటల్ యుగానికి అనుసంధానం చేయడం అత్యంత అవసరం. ఈ జాతీయ సదస్సు ద్వారా తెలుగు భాషా పరిశోధనకు కొత్త మార్గాలు, నూతన ఆలోచనలు వెలువడతాయని, విద్యార్థులు మరియు పరిశోధకులు ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.”
ఈ సభకు సంచాలకులుగా ఆచార్య మాడభూషి సంపత్ కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య టి వీరారెడ్డి, తెలుగు విభాగాధిపతి డాక్టర్ మైల త్యాగరాజు, కన్వీనర్‌గా డాక్టర్ రాజారామ్, డాక్టర్ వెంకటేశ్వర్లు మరియు వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో విద్యార్ధిని విద్యార్ధు పాల్గొనారు.