
_ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రదాత పొట్టి శ్రీరాములు__
_వీఎస్యూలో ఘనంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం_
_అమరజీవి విగ్రహానికి ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు నివాళి…._
……………….
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని, నెల్లూరు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం (వీఎస్యూ) ప్రాంగణంలో స్వాతంత్య్ర సమరయోధుడు, అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి ఘన నివాళులు అర్పించారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు గారు, ప్రాంగణంలోని అమరజీవి విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన త్యాగస్ఫూర్తిని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ, “అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం అహింసా మార్గంలో పోరాడి ప్రాణత్యాగం చేసిన మహనీయుడు,” అని కొనియాడారు. ఆయన త్యాగం వల్లే ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించిందని గుర్తుచేశారు. “పొట్టి శ్రీరాములు గారి త్యాగం తెలుగు ప్రజల ఐక్యతకు చిహ్నం,” అని ఆయన పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గం నేటి యువతకు ప్రేరణ కావాలని పిలుపునిచ్చారు. అమరజీవి కలలు కన్న రాష్ట్రాన్ని నిర్మించడం మనందరి బాధ్యత అని అన్నారు. విశ్వవిద్యాలయ విద్యార్థులు సామాజిక సేవలో చురుకుగా పాల్గొని, రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు పాత్ర పోషించాలని ఉపకులపతి ఆకాంక్షించారు.
అనoతరం రిజిస్ట్రార్ డాక్టర్ కె. సునీత మాట్లాడుతూ, “అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగం ప్రతి ఆంధ్రుడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయన ఆత్మస్ఫూర్తిని స్మరించుకుంటూ మనం రాష్ట్ర అభివృద్ధి దిశగా కృషి చేయాలి,” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సిహెచ్ విజయ, ఆచార్య సుజా ఎస్ నాయర్ , ఆచార్య టి వీరారెడ్డి, డాక్టర్ పి.చెంచురెడ్డి, ఎన్ ఎస్ ఎస్ సమన్వయకర్త డాక్టర్ అల్లం ఉదయశంకర్, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ ఎస్ బి సాయి నాద్, డాక్టర్ శంకర్, డిన్ సి డి సి డాక్టర్ యం హుస్సేనయ్య, సహాయక రిజిస్ట్రార్ డాక్టర్ జి సుజయ్ కుమార్, అధికారులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.