
*దేశ సమైక్యతకు ప్రతీక సర్దార్ పటేల్: వీసీ ఆచార్య అల్లం శ్రీనివాసరావు…*
*నెల్లూరులో ఘనంగా సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి*
*విక్రమ సింహపురి యూనివర్సిటీ జాతీయ సేవా పథకం, మై భారత్ నెల్లూరు సంయుక్తంగా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ…*
నెల్లూరు: భారతదేశపు ఉక్కు మనిషి, దేశ సమైక్యతా శిల్పి సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా శుక్రవారం నెల్లూరులో ఘనంగా కార్యక్రమం జరిగింది. విక్రమ సింహపురి యూనివర్సిటీ జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) మరియు మై భారత్ నెల్లూరు ఆధ్వర్యంలో పిఆర్సి మైదానం నుండి కరెంట్ ఆఫీస్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
ర్యాలీ అనంతరం కరెంట్ ఆఫీస్ సెంటర్లోని సర్దార్ పటేల్ విగ్రహం వద్ద యూనివర్సిటీ వైస్ – చాన్సలర్ ఆచార్య శ్రీనివాసరావు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వీసీ ఆచార్య శ్రీనివాసరావు మాట్లాడుతూ — “దేశ సమైక్యతకు ప్రతీకగా నిలిచిన సర్దార్ పటేల్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం. భారత స్వాతంత్ర్య పోరాటంలోనూ, దేశ సమీకరణలోనూ ఆయన చూపిన దృఢ సంకల్పం, నాయకత్వం నేటికీ మార్గదర్శకం. పటేల్ చూపిన దేశభక్తి, నిజాయితీ, క్రమశిక్షణ, సేవా భావాలను విద్యార్థులు అలవరచుకోవాలి. అదే ఆయనకు అర్పించే నిజమైన నివాళి” అన్నారు.
మై భారత్ సమన్వయకర్త పి. సురేంద్రరెడ్డి మాట్లాడుతూ — “పటేల్ వంటి మహనీయుల అంకితభావం, పరిపాలనా నైపుణ్యాలు ప్రతి భారతీయుడికి ఆదర్శం. దేశ ఏకీకరణలో ఆయన పోషించిన విశిష్టమైన పాత్రను యువత గుర్తుచేసుకుంటూ, ఆయన త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ సేవలో ముందంజ వేయాలి” అని పేర్కొన్నారు.
మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వై.ఓ. నందన్ మాట్లాడుతూ — “సర్దార్ పటేల్ దేశ ఐక్యతకు ప్రతీక. ఆయన చూపిన పరిపాలనా దృక్పథం, క్రమశిక్షణ నేటికీ ప్రభుత్వ వ్యవస్థకు ఆదర్శంగా నిలుస్తోంది. యువత ఆయన చూపిన మార్గంలో నడిస్తే దేశం మరింత బలపడుతుంది. ప్రతి పౌరుడు దేశ ఏకతా, సామరస్య భావనతో ముందుకు సాగాలి” అని అన్నారు. ఆర్ఐఓ వారప్రసాద్ మాట్లాడుతూ — “పటేల్ చూపిన జాతీయ ఏకతా భావం, నాయకత్వ నైపుణ్యం యువతకు స్ఫూర్తి. దేశ సమైక్యతను కాపాడే దిశగా ప్రతి విద్యార్థి చైతన్యవంతుడిగా మారాలి” అని అన్నారు.
డా. ఎ. మహేంద్ర రెడ్డి (డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్) మాట్లాడుతూ — “సర్దార్ పటేల్ చూపిన ఏకతా, సమగ్రత, సేవాభావం ప్రతి భారత యువకుడిలో నాటాలి. ఆయన చూపిన మార్గం ద్వారా దేశ అభివృద్ధి సాధ్యమవుతుంది. సమాజ సేవ ద్వారా దేశ నిర్మాణంలో యువత పాత్ర కీలకం” అని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ డా. కె. సునీత, యన్ ఎస్ ఎస్ సమన్వయకర్త డాక్టర్ అల్లం ఉదయశంకర్, యన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్, డాక్టర్ బివి సుబ్బారెడ్డి, డాక్టర్ శంకర్, డాక్టర్ సుచరిత, మై భారత్ సమన్వయకర్తలు ఎన్.కె. యశ్వంత్, సుబ్రహ్మణ్యం రెడ్డి ,వై ఫణి రాజు, ఎల్. రాజశేఖర్, యూనివర్సిటీ అధ్యాపకులు, అధికారులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని సర్దార్ పటేల్ జయంతిని ఘనంగా నిర్వహించారు.