*వర్షాకాలపు సమస్యల పట్ల జాగ్రత్తలు పాటించండి*

– ప్రజల సమాచారానికై హెల్ప్ లైన్ సహాయక కేంద్రాల ఏర్పాటు

– కమిషనర్ వై.ఓ నందన్

వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో నగర వ్యాప్తంగా పారిశుద్ధ్య నిర్వహణ ప్రణాళికాబద్ధంగా నిర్వహించేందుకు ప్రజలంతా సహకరించాలని, వర్షాకాలంలో సీజనల్ వ్యాధులతో పాటు వర్షంలో తడిసినందువల్ల జ్వరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని కమిషనర్ వై.ఓ నందన్ బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.

బహిరంగ ప్రదేశాల్లో నీరు నిల్వ ఉండకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, వరద ప్రవాహానికి డ్రైను కాలువల పూడికతీత పనులు అన్ని డివిజన్లలో చేపడుతున్నామని ప్రజలంతా సహకరించాలని కోరారు.

అన్ని డివిజనుల్లో ఇండ్ల చుట్టూ, ప్రాంగణాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకునే విధంగా గృహాల యజమానులకు అవగాహన కల్పిస్తున్నామని, ఖాళీ స్థలాల యజమానులను గుర్తించి వారి ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా సూచనలు చేస్తున్నామని తెలిపారు.

దోమల ఎదుగుదలకు దోహదపడే మంచినీటి సరఫరాలో లీకేజీ ప్రాంతాలు, వాడి పడేసిన టైర్లలో నిల్వ ఉండే నీరు, బహిరంగ ప్రదేశాల్లో డంప్ చేసిన ఖాళీ కొబ్బరి బోండాలలో నిల్వ ఉండే వర్షపు నీరు, పూల కుండీలు, వాడకంలో లేని నీటి తొట్లు, బావులపై ప్రజలందరూ అవగాహన పెంచుకొని తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కమిషనర్ కోరారు.

వర్షాకాలంలో వాతావరణంలో చోటు చేసుకునే మార్పుల ఫలితంగా సీజనల్ వ్యాధులతో పాటు విష జ్వరాలు ప్రభలే అవకాశం అధికంగా ఉంటుందని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు కాచి వడగాచిన నీటిని తీసుకోవాలనే అంశాలపై ప్రజలు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

నగరపాలక సంస్థ పరిధిలోని మినరల్ వాటర్ ప్లాంట్లలో నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలను ఉల్లంఘిస్తే ప్లాంట్లను మూసివేస్తామని కమిషనర్ హెచ్చరించారు.

నగర పాలక సంస్థ పరిధిలో సీజనల్ వ్యాధులపట్ల సమాచారం, చికిత్స, ఇతర వివరాల కోసం 0861-2316777 నెంబరులో సహాయ సిబ్బందిని 24 గంటలపాటు అందుబాటులో ఉంచామని, మంచినీటి సరఫరా, పారిశుధ్యం అంశాలపై సమస్యలకోసం 0861-2356777 నెంబరు ద్వారా సహాయాన్ని అందించేందుకు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రత్యేక సిబ్బందిని నియమించామని కమిషనర్ తెలిపారు. సంబంధిత సమాచారం కోసం కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్లను సంప్రదించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *