
_*తుఫాను వేళ వెల్లివిరిసిన మానవత్వం… నిరాశ్రయులకు అండగా వీఎస్యూ వీసీ*_
_విక్రమ సింహపురి యూనివర్సిటీ, నెల్లూరు:_
తుఫాను కారణంగా తీవ్రమైన గాలులు, కుండపోత వర్షం కురుస్తున్న క్షణాల్లోనూ మానవత విలువలను ముందుంచుతూ, విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్
ఆచార్య అల్లం శ్రీనివాసరావు మంగళవారం అర్ధరాత్రి బయటకు వచ్చి నగర వీధుల్లో వణుకుతున్న నిరాశ్రయులకు దుప్పట్లు పంపిణీ చేశారు. చలికి కొట్టుమిట్టాడుతున్న వారికి ఆప్యాయంగా ధైర్యం చెప్పి, స్వయంగా దుప్పట్లు అందజేయడం విశేషం.
ఈ సేవా కార్యక్రమాన్ని వీఎస్యూ ఎన్ఎస్ఎస్ సెల్ మరియు ‘హెల్ప్ ది నీడీ’ బృందం సంయుక్తంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి శ్రీ చుక్కల పార్థసారధి (ఎన్ఎస్ఎస్ జాతీయ అవార్డు గ్రహీత, నెల్లూరు) మరియు శ్రీ సంకూరి ప్రవీణ్ రామ్ (టెక్సాస్, యూఎస్ఏ) ఉదారంగా అందించిన ఆర్థిక సహకారంతో మొత్తం 100 దుప్పట్లు సేకరించి అవసరమున్న వారికి పంపిణీ చేశారు.
కార్యక్రమాన్ని డాక్టర్ ఉదయ్ శంకర్ అల్లం (ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్) మరియు డాక్టర్ బి.వి. సుబ్బారెడ్డి (ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్) సమన్వయం చేశారు.
తుఫాన్ నడుమ కూడ వీఎస్యూ సమాజపట్ల తన బాధ్యతను నిలబెట్టుకున్న ఈ చర్య, “విద్యతో పాటు సేవా స్పూర్తి – ఇదే వీఎస్యూ వైఖరి” అని మరోసారి చాటిచెప్పింది.