అనుమతులు అతిక్రమించిన నిర్మాణాలకు ఛార్జ్ షీట్లు దాఖలు చేయండి

– కమిషనర్ వై.ఓ నందన్

నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో పట్టణ ప్రణాళిక విభాగం నిర్మాణ అనుమతులు అతిక్రమించి నిర్మిస్తున్న భవనాలను గుర్తించి ఛార్జ్ షీట్లు దాఖలు చేయాలని కమిషనర్ వై.ఓ నందన్ ప్లానింగ్ విభాగం అధికారులు, వార్డు సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులను ఆదేశించారు.

నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం వారాంతపు సమీక్ష సమావేశాన్ని కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో శనివారం నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భవన నిర్మాణ సమయంలో తప్పనిసరిగా అనుమతులు, ప్లాన్ నమూనాలు అందరికీ కనిపించేలా ప్రదర్శించాలని యజమానులకు అవగాహన కల్పించాలని తెలిపారు. అలా ప్రదర్శించని భవనాలను గుర్తించి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. నిర్మాణ అనుమతుల నిబంధనలను ఉల్లంఘించిన వారికి సీ.ఓ, పి.ఓ నోటీసులు జారీ చేసి ఛార్జ్ షీట్ ఓపెన్ చేయించాలని సూచించారు.

నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో ఆక్యుఫెన్సీ సర్టిఫికెట్లు తీసుకోకుండా భవనాలను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న వారిని గుర్తించి వెంటనే నోటీసులు జారీ చేయాలని కమిషనర్ ఆదేశించారు.

భవన నిర్మాణాలను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ నిర్మాణ సామాగ్రితో వీధులు ఆక్రమణలకు గురవకుండా చర్యలు తీసుకోవాలని, నిర్మాణ వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించేలా నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు.

అనధికార లేఔట్లను గుర్తించి వాటి యజమానులకు అవగాహన కల్పించి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం కల్పించిన ఎల్ఆర్ఎస్ పథకం అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ సమావేశంలో నెల్లూరు నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు మురళి, సతీష్, రఘునాథ రావు, టిపిబిఓ లు, వార్డు సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed