కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఆరోపణలు హాస్యాస్పదం – బీజేపీ జిల్లా కార్యదర్శి చిలకా ప్రవీణ్
నెల్లూరు, జూన్ 24: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలను బీజేపీ జిల్లా కార్యదర్శి చిలకా ప్రవీణ్ కుమార్ ఖండించారు. ఆమె ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, హాస్యాస్పదంగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
“బీజేపీ ఎవరికీ ఊడిగం చేయదు. మేము దేశ ప్రయోజనాల కోసమే పని చేస్తాం. గతంలో కాంగ్రెస్ అనేక అపవిత్ర పొత్తులు పెట్టుకుంది,” అని ఆయన విమర్శించారు. పోలవరం, ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ చిత్తశుద్ధితో ఉందని, విభజన హామీలను నెరవేర్చేందుకు కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌ను విభజించి రాష్ట్రానికి నష్టం చేసిన పార్టీ కాంగ్రెస్‌యేనని గుర్తు చేశారు. ఆ తప్పుల బాధ్యతను బీజేపీపై నెట్టాలని షర్మిల ప్రయత్నించడం తగదన్నారు. “డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అంటే కేంద్ర-రాష్ట్రాలు కలసి అభివృద్ధి కోసం పని చేయడం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి పరుగులు పెడుతోంది,” అని అన్నారు.
ప్రభుత్వ పథకాల అమలుకు సమయం పట్టే విషయాన్ని గుర్తుచేస్తూ, “మీ పార్టీ బలోపేతం కావాలని బీజేపీపై నిరాధార ఆరోపణలు చేయడం తగదు,” అని స్పష్టం చేశారు. బీజేపీ దేశాభివృద్ధి పథంలో నడుస్తోందని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తెలిపారు.