*దివ్యాంగులకు తోడుగా ఉంటాం – ఎంపీ వేమిరెడ్డి*

– విపిఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్‌ పరిధిలో 100 మంది దివ్యాంగులకు ట్రై సైకిళ్ల అందజేత
– జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 950 ట్రై సైకిళ్లు అందించాం.
– దివ్యాంగుల బాధలను కొంతైనా తీర్చాలన్న సంకత్పంతో సాగుతున్నాం – ఎంపీ
– ఎంపీ పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి – శ్రీధర్‌రెడ్డి

దివ్యాంగుల కళ్లలో ఆనందం చూసేందుకు.. వారికి తోడుగా నిలిచేందుకు ఎలక్ట్రికల్‌ ట్రై సైకిళ్ల అందజేత కార్యక్రమం నిర్వహిస్తున్నామని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు అన్నారు. ఎన్నికల ప్రచారంతో దివ్యాంగులు పడుతున్న అవస్థలను ప్రత్యక్షంగా చూసి ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన వివరించారు. నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ పరిధిలోని 100 మంది దివ్యాంగులకు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి గారు, గిరిధర్‌రెడ్డి గారితో కలిసి బుధవారం విపిఆర్ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఎలక్ట్రిక్‌ ట్రై సైకిళ్ల అందజేత కార్యక్రమం నిర్వహించారు. ట్రై సైకిళ్లు అందుకున్న దివ్యాంగులు చెమర్చిన కళ్లతో ఎంపీ వేమిరెడ్డికి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇన్నాళ్లు తమను పట్టించుకున్నవారు లేరని, తొలిసారి సొంత నిధులతో ఆదుకుంటున్న ఆయనకు పాదాభివందనాలు చేశారు.

ముందుగా సభా ప్రాంగణానికి చేరుకున్న ఎంపీ వేమిరెడ్డికి, ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డికి నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ట్రై సైకిళ్ల వద్దకు వెళ్లి దివ్యాంగులను ఆప్యాయంగా పలకరించారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారికి భరోసా ఇచ్చి ట్రై సైకిల్‌ ఉపయోగంపై వివరించారు.

ఈ సందర్బంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. దివ్యాంగుల్లో కదలిక తెచ్చి వారు.. ఆత్మస్థైర్యంతో జీవించేందుకు ఎలక్ట్రిక్‌ ట్రై సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు. ఉదయగిరి ప్రాంతంలో దివ్యాంగులను చూసి చలించిపోయామని, అందుకు ప్రతిరూపమే ఈ కార్యక్రమమన్నారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా దాదాపు 850 మందికి ట్రై సైకిళ్లు అందించామని, ఈ రోజు రూరల్‌ నియోజకవర్గంలో 100 మందికి పంపిణీ చేశామన్నారు. ట్రై సైకిళ్ల నిర్వహణ కూడా ఫౌండేషన్‌ తరఫునే చేపడతామని, ఎక్కడ ఇబ్బందులు వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఎవరైనా మిస్‌ అయి ఉంటే తమకు తెలియజేస్తే ట్రై సైకిల్‌ అందజేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 170కి పైగా వాటర్‌ప్లాంట్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. జిల్లా ప్రజల సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఉండటం అందరి అదృష్టమన్నారు. పార్లమెంట్‌ పరిధిలో నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో 100 మంది దివ్యాంగులకు ఎలక్ట్రిక్‌ ట్రై సైకిళ్లు అందించడం గొప్ప విషయమన్నారు. ఎంపీ అనే పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి అని, ఆయనకు భగవంతుడి ఆశీసులు మెండుగా ఉండాలన్నారు. ఒక మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీగారికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నెల్లూరు పార్లమెంట్‌ పరిధిలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి ముందు, తర్వాత అని మాట్లాడుకునే స్థాయికి తెచ్చారన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఇన్‌ల్యాండ్‌ వాటర్‌ వేస్‌ అధారిటీ ఛైర్మన్‌ జడ్‌ శివప్రసాద్‌ మాట్లాడుతూ.. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ కార్యక్రమం చేపట్టడం పొలిటికల్ మైలేజీ కోసం కాదని, రాజకీయాల్లోకి రాకముందు నుంచే సేవా కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. పల్లెల్లో నీటి ఎద్దడిని నివారించేందుకు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారన్నారు. ఎంపీ అందిస్తున్న సహాయ సహకారాలను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో నేతలు కేతంరెడ్డి వినోద్‌రెడ్డి, కోడూరు కమలాకర్‌రెడ్డి, ఎల్‌సీ రమణారెడ్డి, గుడి హరి రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed