*రాజకీయ పిచ్చితో సీతమ్మ కు మాంగల్య ధారణ చేసిన వైసీపీ ఎమ్మెల్యే : బిజెపి నమామిగంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్*
శ్రీరాములు వారి కల్యాణంలో కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి సీతమ్మ ప్రతిమకు మాంగల్య ధారణ చేయడం రాజకీయ పిచ్చికి పరాకాష్టగా ఉందనీ అతనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని బిజెపి నమామిగంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్ ప్రకటనలో డిమాండ్ చేశారు.
శ్రీరామనవమి వేడుకలలో భాగంగా ప్రతి ఏడు ఆలయాలలో నిర్వహించే సీతమ్మ రాములవారి కల్యాణంలో వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి క్షమించరాని అపచారానికి పాల్పడ్డారు.
శాసనసభ్యులు స్వగ్రామం చిప్పగిరి ఆంజనేయస్వామి దేవాలయంలో శ్రీరామనవమి రోజు రాములవారి కళ్యాణంలో పాల్గొన్న ఎమ్మెల్యే విరూపాక్షి పూజారి చేతిలోని మాంగల్యాన్ని తీసుకొనిసీతమ్మ ప్రతిమకు ధారణ చేసి ధర్మ వ్యతిరేక చర్యకు పాల్పడ్డారు.
ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ పూజారులే పరమ నిష్టతో ఆ సమయంలో తమను భగవాన్ శ్రీరామునీగానే భావిస్తూ మాంగల్య ధారణ చేస్తారు. ఈ కార్యాన్ని సాక్షాత్తు శ్రీరాముడే చేసినట్లు పూజారులు గాని రామ భక్తులు గాని హిందూ భక్తులు గాని విశ్వసిస్తారు.
అటువంటి పరమ నిష్ట కార్యాన్ని ఎమ్మెల్యే విరూపాక్షి అపవిత్రం చేసి క్షమించరాని తప్పు చేశారు. సనాతన ధర్మ కార్యాన్ని అపవిత్రం చేసిన ఎమ్మెల్యే విరూపాక్షి పై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని రమేష్ డిమాండ్ చేశారు.