ఉదయం 7 గంటల నుంచి పెన్షన్ల పంపిణీ ప్రక్రియను ప్రారంభించండి
– నిర్దేశించిన సర్వేలలో ప్రతి ఒక్క వార్డు కార్యదర్శి పాల్గొనాలి
– అదనపు కమిషనర్ వై.ఓ నందన్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ ప్రక్రియను నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని ప్రతి ఒక్క వార్డు సచివాలయ పరిధిలో శనివారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభించాలని అదనపు కమిషనర్ వై ఓ నందన్ ఆదేశించారు.
ఈ మేరకు శుక్రవారం వార్డు సచివాలయ కార్యదర్శులు, జోనల్ ఇన్చార్జిలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్క పెన్షన్ దారుని సహృదయంగా స్వాగతించి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడిన 20 సెకండ్ల మెసేజ్ ను వారికి వినిపించాలని సూచించారు. ఐ.వి.ఆర్ ఫోన్ కాల్ ద్వారా పెన్షన్ దారుల అభిప్రాయ సేకరణలో వారు తెలియజేసే సంతృప్తి స్థాయిని పరిగణలోకి తీసుకుంటారని, కావున పెన్షన్ లబ్ధిదారులతో వినయపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు.
26 మంది జోనల్ ఇన్చార్జీలు తమకు కేటాయించిన సచివాలయాలలో ఉదయం ఏడు గంటల నుంచి పెన్షన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభమయ్యేలా ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. 300 మీటర్ల దూరానికి పైన ఉన్న గృహాలకు చేరుకోలేని కారణాలను యాప్ లో ఎంచుకొని అప్లోడ్ చేయాలని సూచించారు. పెన్షన్ యాప్ కొత్తగా అప్డేట్ అయి ఉన్నందున ప్రతి ఒక్కరు యాప్ ను అప్డేట్ చేసుకుని పంపిణీ ప్రక్రియలో పాల్గొనాలని అదనపు కమిషనర్ ఆదేశించారు.
అదేవిధంగా గ్రామ సచివాలయం & వార్డు సచివాలయం విభాగం ఆధ్వర్యంలో వార్డు సచివాలయ కార్యదర్శులకు నిర్దేశించిన వివిధ రకాల సర్వేలను తప్పనిసరిగా ప్రతి ఒక్క వార్డు సచివాలయ కార్యదర్శి విజయవంతంగా పూర్తి చేయాలని అదనపు కమిషనర్ ఆదేశించారు. డప్పు కళాకారుల వివరాలను వెల్ఫేర్ కార్యదర్శులు ప్రత్యేకంగా సేకరించి నివేదికలను ఉన్నతాధికారులకు అందజేయాలని సూచించారు. సర్వే నిర్వాహణలో ప్రతి ఒక్క కార్యదర్శి గడపగడపకు తిరిగి సర్వే ఆవశ్యకతను ప్రజలకు వివరించి సమగ్రమైన వివరాలను సేకరించాలని అదనపు కమిషనర్ ఆదేశించారు.
.