*మాతృభా షని గౌరవిద్దాం : వి ఎస్ యూ రిజిస్ట్రార్…*
……
నెల్లూరు జిల్లా కాకుటూరు లోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ తెలుగు శాఖ ఆధ్వర్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు భవనంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ కె. సునీత గారు విశిష్ట అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి వక్తలుగా శ్రీమతి జి. సుభద్రాదేవి (అధ్యక్షులు, పెన్న రచయితల సంఘం, నెల్లూరు), డాక్టర్ కె. ఈశ్వరమ్మ (అసిస్టెంట్ ప్రొఫెసర్,తెలుగు శాఖ, డీకేడబ్ల్యూ డిగ్రీ కళాశాల, నెల్లూరు) మరియు శ్రీ అవ్వారి శ్రీధర్ బాబు (మాజీ అధ్యక్షుడు, పెన్న రచయితల సంఘం, నెల్లూరు) పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ కె సునీత మాట్లాడుతూ “మాతృభాష మన సంస్కృతి, సంప్రదాయాల ప్రతిబింబం. భవిష్యత్తు తరాలకు భాషా వారసత్వాన్ని అందించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. భాష మాత్రమే కాదు, భాషతో కూడిన భావజాలాన్ని, జ్ఞానాన్ని తరతరాలకు అందించాల్సిన అవసరం ఉంది, అందుకే మనం మాతృభాషను గౌరవిద్దాం ” అని తెలిపారు.
అలాగే, వక్త జి. సుభద్రాదేవి, మాట్లాడుతూ “మాతృభాష మన భావప్రకటనా సాధనం మాత్రమే కాక, మన మూలాలను గుర్తు చేసే అనుబంధం కూడా. మాతృభాషలో నేర్చుకున్న జ్ఞానం ఎంతో నిలకడగా ఉంటుంది. విద్యార్థులు తమ అభ్యాసాన్ని, సాహిత్యాన్ని మాతృభాషలో పెంపొందించుకోవాలి మాతృభాషను వృద్ధి చేసుకునున్న దేశాలు అభివృద్ధి వైపు నడుస్తున్నాయని “సూచించారు.
డాక్టర్ కె. ఈశ్వరమ్మ మాట్లాడుతూ, “భాష అనేది ఒక సామాజిక వారసత్వం. దాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. మాతృభాష అభివృద్ధి కోసం పిల్లలకు చిన్ననాటి నుంచే తెలుగులో మాట్లాడే అలవాటు చేయాలి. ప్రాంతీయ భాషలల్లో విద్యాభోధన కచ్చితంగా జరగాలని తెలిపారు.
శ్రీ అవ్వారి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, “భాష మన ఉనికి. మాతృభాషలో రాసే సాహిత్యంలో భావోద్వేగాలు సహజత్వం కలిగి ఉంటుంది. నేటి తరానికి తెలుగులో చదవడం, రచనలు చేయడం ప్రోత్సహించాలి. భాషా పరిరక్షణ కోసం ప్రభుత్వాలు, సంస్థలు, విద్యాసంస్థలు కలిసికట్టుగా ముందుకు రావాలి” అని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యం.హనుమారెడ్డి,తెలుగు శాఖ ఇంచార్జ్ హెడ్ డాక్టర్ యం. త్యాగరాజు, డాక్టర్ ఆర్ ప్రభాకర్, తెలుగు శాఖ అధ్యాపకులు డా” సి.రాజారామ్,డా” టి.విమల, డా” కె.లక్ష్మీనారాయణ రెడ్డి, డా” వి.వెంకటేశ్వర్లు మరియు విద్యార్ధిని విద్యార్ధులు పాల్గొనారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed