ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు
– కమిషనర్ సూర్య తేజ ఐ.ఏ.ఎస్.,
నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని కార్పొరేషన్ కు చెందిన రిజర్వ్ ఓపెన్ ఖాళీ స్థలాలను ఎవరైనా ఆక్రమిస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని, ఆయా నిర్మాణాలను తప్పనిసరిగా కూల్చివేస్తామని కమిషనర్ సూర్య తేజ హెచ్చరించారు.
స్థానిక 38వ డివిజన్ రమేష్ రెడ్డి నగర్, ఆచారి స్ట్రీట్, సి.ఏ.ఎం హై స్కూల్ పరిసర ప్రాంతాలలో కమిషనర్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణను శుక్రవారం చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరపాలక సంస్థ కు చెందిన రిజర్వ్ ఖాళీ స్థలాలు, ప్రభుత్వ స్థలాలను గుర్తించి మార్కింగ్ చేయమని సిటీ ప్లానింగ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు అలాగే ప్రైవేటు స్థలాలను వాటి యజమానులే శుభ్రం చేసుకునేలా నోటీసులు జారీ చేసి వార్డ్ సచివాలయ అడ్మిన్, శానిటేషన్, ప్లానింగ్, అమెనిటీస్ కార్యదర్శులు పర్యవేక్షించాలని సూచించారు.
ప్రధాన కాలువలను 15 రోజులకు ఒకసారి తప్పనిసరిగా శుభ్రం చేసి పూడిక తీత పనులను చేపట్టాలన్నారు. స్థానిక డివిజన్ పరిధిలో జరుగుతున్న సిమెంటు రోడ్ల నిర్మాణం పనులను, ప్యాచ్ వర్క్ పనులను పరిశీలించారు. ప్రస్తుత రోడ్డు నిర్మాణంలో నాణ్యత లోపించి ఉందని, నిర్మించిన రెండు సంవత్సరాలకే ధ్వంసం అయిపోవడంతో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.
సి.ఏ.ఎం స్కూల్, పాత జైలు, పెట్రోల్ స్టేషన్ తదితర ప్రాంతాలలో పర్యటించిన కమిషనర్ ఆయా ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పెట్రోల్ స్టేషన్ నిర్వాహకులకు సూచించారు. స్థానిక పంటకాలువలో పూడికతీత పనులు చేపట్టి, సమీపంలోని ఖాళీ స్థలాల్లో ఆహ్లాదంగా వుండేందుకు మొక్కల పెంపకాన్ని చేపట్టాలని సూచించారు.
స్థానిక రియాజ్ హోటల్ నిర్వాహకులు వాడేసిన కుండలు, కవర్లను పక్కనే ఉన్న పంట కాలువలో పడేస్తున్నట్లు గుర్తించిన కమిషనర్ హోటల్ నిర్వాహకులకు జరిమానా విధించాలని ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించారు. హోటల్ సిబ్బందితోనే వంటకాలువను శుభ్రం చేయించాలని సూచించారు.
ఆస్తి పన్ను బకాయి ఉన్న డి.ఆర్. ఉత్తమ్ హోటల్ నిర్వాహకులు ఈరోజు సాయంత్రం లోగా బకాయి మొత్తాన్ని చెల్లించేలా డిప్యూటీ కమిషనర్ పర్యవేక్షించాలని కమిషనర్ ఆదేశించారు. వై.ఎం.సి.ఏ గ్రౌండ్ ఎదురుగా ఉన్న పంట కాలువను ఆక్రమిస్తూ నిర్మిస్తున్న నిర్మాణాన్ని వెంటనే ఆపేయాలని కమిషనర్ ఆదేశించారు. అక్రమ నిర్మాణాలను గుర్తించక, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న స్థానిక ప్లానింగ్ సెక్రటరీకి షోకాజు నోటీసులు జారీ చేయమని కమిషనర్ ఆదేశించారు.
డివిజన్ పరిధిలో జరుగుతున్న ఇంజనీరింగ్ పనులను వేగవంతంగా పూర్తి అయ్యేలా పర్యవేక్షిస్తున్నామని కమిషనర్ తెలిపారు. డివిజన్ పరిధిలో క్రమం తప్పకుండా డ్రైను కాలువల పూడికతీత, సిల్ట్ ఎత్తివేత పనులు జరిగేలా స్థానిక సచివాలయ కార్యదర్శులు పర్యవేక్షించాలని సూచించారు. డివిజన్ పరిధిలో విద్యుత్ వీధి దీపాలు అన్ని ప్రాంతాలలో ఏర్పాటు చేసి, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. కాలువల వెంబడి జంగిల్ క్లియరెన్స్ చేయించి మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు.
అనంతరం ఏ.సీ. కూరగాయల మార్కెట్ అన్న క్యాంటీన్ ను కమిషనర్ సందర్శించి ప్రజలకు అందుతున్న ఆహార నాణ్యతను తనిఖీ చేశారు. క్యాంటీన్లకు వచ్చే ప్రజలకు టోకెన్ విధానం ద్వారానే ఆహారాన్ని అందించాలని కమిషనర్ నిర్వాహకులకు సూచించారు. క్యాంటీన్ ను గతంలో తనిఖీ చేసినప్పుడు సూచించిన మార్పులను అమలు చేయకపోవడంపై నోడల్ అధికారిగా ఉన్న ఆరోగ్యశాఖ అధికారికి షోకాజ్ నోటీసులు జారీ చేయమని కమిషనర్ ఆదేశించారు. టేక్కేమిట్టలోని పాత హెల్త్ ఆఫీసరు క్వార్టర్స్ శిధిలావస్థలో ఉన్నందున వెంటనే దాన్ని పగులకొట్టించాలని ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ. ని ఆదేశించారు. స్థానిక వార్డు సచివాలయ రెవెన్యూ కార్యదర్శి, వార్డ్ ప్లానింగ్ కార్యదర్శి విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్నారని కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ. రామ్ మోహన్ రావు, మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ ,హెల్త్ ఆఫీసర్ డాక్టర్. చైతన్య, వెటర్నరీ డాక్టర్ మదన్మోహన్,ఈ.ఈ. శేషగిరిరావు, ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రదీప్ కుమార్, రెవిన్యూ ఆఫీసర్ ఇనాయతుల్లా, రెవిన్యూ ఇన్స్పెక్టర్లు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.
.