*పధ్ధతి మార్చుకోకుంటే చర్యలు తప్పవు*
– ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆకస్మిక తనిఖీలు
– బుచ్చి సి హెచ్ సి లో నైట్ షిఫ్టులో డాక్టర్లు వుండాలి.
– మధ్యాహ్న భోజన పధకంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి.
– విద్యాకమిటీలు క్రియాశీలకంగా వ్యవహరించాలి.
వైద్య సేవలకు సంబంధించి నిర్లక్ష్యాన్ని సహించనని డాక్టర్లు మరియు వైద్య సిబ్బందిని హెచ్చరించారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. బుచ్చిరెడ్డి పాళెం కమ్యూనిటి హెల్త్ సెంటర్ లో ఆమె ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హాస్పిటల్ అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించారు. ఆసుపత్రిలో వివిధ వార్డులలో రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రాణాపాయ పరిస్థితులలో అత్యవసర వైద్య సేవల కోసం వచ్చే రోగుల సౌకర్యార్ధం నైట్ షిఫ్టులో తప్పనిసరిగా డాక్టర్ల పర్వేక్షణ వుండాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని బుచ్చిరెడ్డి పాళెం కమ్యూనిటి హెల్త్ సెంటర్ వైద్య సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. అసంపూర్తిగా వున్న అదనపు బ్లాక్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటానని హామీ యిచ్చారు. గుండెపోటుతో బాధ పడుతూ హాస్పిటల్ లో చికిత్స చేయించుకుంటున్న బుచ్చి 3 వ సచివాలయ వి ఆర్ ఓ బట్టు సుధాకర్ ను ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు పరామర్శించారు. సిబ్బంది కొరతకు సంబంధించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కార దిశగా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డి పాళెం కమ్యూనిటి హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ డాక్టర్ పద్మజ, బుచ్చి మున్సిపల్ ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ, టిడిపి సీనియర్ నాయకులు ఎంవి శేషయ్య, కోడూరు కమలాకర్ రెడ్డి, బెజవాడ వంశీకృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆకస్మిక తనిఖీలలో భాగంగా దామరమడుగు ఉన్నత పాఠశాల సందర్శించి మధ్యాహ్న భోజన పధకం తీరు తెన్నులను పరిశీలించారు. 416 మంది సామర్ధ్యం వున్న హైస్కూల్ లో 283 మంది మాత్రమే హాజరయిన సంఘటనకు సంబంధించి ఇంచార్జి హెడ్ మాస్టర్ నరసింహ రావును ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ప్రశ్నించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి రుచి, శుచి, నాణ్యతలను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం పై విద్యార్థుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల నిర్వహణలో విద్యాకమిటీలు క్రియాశీలకంగా వ్యవహరించాలని కోరారు. తల్లి తండ్రులు సైతం తరచూ పాఠశాలలకు వెళ్లి పరిస్థితులను పరిశీలించాలని కోరారు. పిల్లల ఉజ్వల భవిషత్తుకు అధ్యాపకులతో పాటు తల్లితండ్రులు కూడా కృషి చేయాలన్నారు. విద్యా ప్రమాణాలు పెంచే దిశగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషిని స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలన్నారు. విద్యాకమిటీ సభ్యులు, తల్లితందులు, ఉపాధ్యాయులు విద్యార్థుల హాజరు శాతం పెంచేలా కృషి చేయాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో బుచ్చి మున్సిపల్ ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ, చేజర్ల మహేష్, బెజవాడ జగదీష్, కోడూరు కమలాకర్ రెడ్డి, బెజవాడ వంశీకృష్ణా రెడ్డి, ఎంపిడిఓ శ్రీహరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.