మహా కుంభ మేళా వెళ్లే వారికి కింజరాపు శుభవార్త

Maha Kumbh 2025: ఇంకొన్ని గంటల్లో మహా కుంభమేళా 2025 ప్రారంభం కాబోతోంది. దీనికోసం- ఉత్తరప్రదేశ్‌లో చారిత్రాత్మక నగరం ప్రయాగ్‌రాజ్ ముస్తాబైంది. కోట్లాదిమంది భక్తుల కోసం యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేసింది. కుంభమేళా సందర్శకుల కోసం దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల నుంచి ప్రత్యేక రైళ్లు, విమానాలు అందుబాటులోకి వచ్చాయి.

సోమవారం అంగరంగ వైభవంగా మహా కుంభమేళ ఆరంభం కానుంది. ఫిబ్రవరి 26వ తేదీ వరకు కొనసాగుతుంది. అఘోరీ, నాగ, అఖండ్, అఖాడీ, నిరాకారీ.. వంటి సాధవులు ఇప్పటికే ప్రయాగ్‌రాజ్‌కు చేరుకున్నారు. వేలాదిమంది సాధువులతో కిటకిటలాడుతోందీ ఆధ్యాత్మిక నగరి.

మహా కుంభ్‌కు వెళ్లే వారికి పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శుభవార్త చెప్పారు. ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయంలో రాత్రివేళా టేకాఫ్‌కు అనుమతులు ఇచ్చినట్లు వెల్లడించారు. మహా కుంభ మేళాలో పుణ్యస్నానాలను ఆచరించడానికి దేశ విదేశాల నుంచి వచ్చే కోట్లాదిమంది భక్తుల సౌకర్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు

106 సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయం నుండి రాత్రి వేళ విమానాలు టేకాఫ్ తీసుకోబోతోన్నాయని కింజరాపు వెల్లడించారు. ఫలితంగా 24 గంటల పాటు ఈ ఎయిర్ పోర్ట్ కార్యకలాపాలు కొనసాగింపజేయడానికి శ్రీకారం చుట్టినట్టయిందని పేర్కొన్నారు.

మహా కుంభ మేళాను దేశ సాంస్కృతిక వారసత్వ సంపదగా అభివర్ణించారాయన. దేశ సమైక్యత, సమగ్రతకు ఇదొక చిహ్నమని, యావత్ దేశ ప్రజలు ఏకతాటిపైకి వచ్చి జరుపుకొనే అతి పెద్ద వేడుకగా పేర్కొన్నారు. భగవంతుని ఆశీర్వాదం, తమ ప్రభుత్వం ఆధునిక మౌలిక సదుపాయాలను కల్పించడం వల్ల ప్రయాగ్‌రాజ్‌కు ఎయిర్ కనెక్టివిటీ మరింత మెరుగుపడిందని చెప్పారు.

ప్రయాగ్‌రాజ్ ఎయిర్ పోర్ట్ నుండి దేశంలో పలు ప్రధాన నగరాలకు విమాన సర్వీసులు అందుబాటులో ఉంటోన్నాయి. ఢిల్లీ, ముంబై, రాయ్‌పూర్, లక్నో, బెంగళూరు, భువనేశ్వర్, హైదరాబాద్, కోల్‌కత, బిలాస్‌పూర్.. వంటి నగరాలకు ఎయిరిండియా, ఇండిగో సహా వివిధ పౌర విమానయాన సంస్థలు ఫ్లైట్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాయి

ఇప్పటివరకు వరకు కూడా రాత్రివేళ టేకాఫ్ ఉండేది కాదు. ఇప్పుడు ఈ కొరతను తీర్చింది కేంద్ర ప్రభుత్వం. ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయం నుండి రాత్రి వేళ విమానాలు టేకాఫ్ తీసుకునేలా చర్యలు చేపట్టింది. మహా కుంభ మేళాను పురస్కరించుకుని ఈ సౌకర్యాన్ని ప్రారంభించింది కేంద్రం.

(జన హుషార్ న్యూస్)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *