టీడీపీలో ఇకపై పదవులు ఇలా ..లోకేష్ మనసులో మాట..!
దాదాపు ఐదు దశాబ్దాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీలో పదవులపై చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అధికారంలో ఉన్నా, లేకపోయినా టీడీపీలో పదవులంటే హాట్ కేకుల్లానే ఉంటాయి. అదే అధికారంలో ఉంటే ఆ ఒత్తిడి మరింత ఎక్కువగా ఉంటుంది.
ఈ నేపథ్యంలో పార్టీలో పనిచేసే నేతలకు పదవులు ఇచ్చే విషయంలోనూ అంతర్గతంగా చర్చ జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో నిన్న పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో పర్యటించిన నారా లోకేష్ తన మనసులో మాట బయటపెట్టారు.
టీడీపీలో పదవుల పంపకాలపై చర్చ జరుగుతున్న వేళ నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండుసార్లు పదవిలో ఉన్న వ్యక్తి ఆ తర్వాత ఉన్నత పదవికైనా వెళ్లాలి లేదా ఓ విడత ఖాళీగా అయినా ఉండాలంటూ లోకేష్ వ్యాఖ్యానించారు. పార్టీ కోరుకుంటే కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అయినా తాను అయినా పదవి తీసుకోకుండా సామాన్య కార్యకర్తలా పనిచేయాలంటూ లోకేష్ తేల్చిచెప్పేశారు. దీంతో లోకేష్ వ్యాఖ్యలు టీడీపీలో వరుసగా పదవుల కోసం పోటీ పడుతున్న నేతలకు షాక్ ఇచ్చాయి.
అయితే తన వ్యూహం వెనుక ఉన్న కారణాన్ని కూడా లోకేష్ వెల్లడించారు. ఇలా టీడీపీలో వరుసగా రెండుసార్లు పదవిలో ఉన్న నేత ప్రమోషన్ అయినా తీసుకోవాలి లేదా ఓ విడత ఖాళీగా ఉండాలంటూ అనుకుంటున్న దానిపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని లోకేష్ చెప్పేశారు. దీని వల్ల క్షేత్రస్ధాయిలో పనిచేసే వారు పొలిట్ బ్యూరో వరకూ వచ్చే అవకాశం లభిస్తుందన్నారు. అలాగే పార్టీ కూడా బలపడుతుందని లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవుల్ని నెల రోజుల్లో భర్తీ చేస్తామని లోకేష్ క్లారిటీ ఇచ్చారు. దీంతో నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్న వారికి మరో నెల రోజుల వెయిటింగ్ తప్పేలా లేదు.