తిరుమల, తిరుపతిల్లో 94 కౌంటర్లు సిద్ధం..!!
తిరుమల: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శుక్రవారం నాడు 56,550 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 28,550 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.34 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
ప్రస్తుతం భక్తులు వైకుంఠం కాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లల్లో వేచివుండనక్కర్లేదు. క్యూలైన్ ద్వారా నేరుగా స్వామివారి దర్శనానికి వెళ్లొచ్చు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 నుంచి 6 గంటల సమయం పడుతోంది.
వైకుంఠ ఏకాదశి పర్వదినం కోసం ముస్తాబవుతోంది తిరుమల. జనవరి 10 నుండి 19వ తేది వరకు శ్రీనివాసుడిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునే భాగ్యం లక్షలాది మంది భక్తులకు కలగబోతోంది. దీనికోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. లక్షలాదిమంది భక్తులు వచ్చే అవకాశం ఉండటం వల్ల దానికి అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టింది
వైకుంఠ ద్వారా దర్శనం కోసం తిరుపతి, తిరుమలలో ఈ నెల 10, 11, 12 తేదీలకు సంబంధించిన స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీ 9వ తేదీన తెల్లవారు జామున 5 గంటలకు మొదలవుతుంది. మొత్తంగా 1.20 లక్షల టోకెన్లు జారీ చేస్తారు.
13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఏ రోజు దర్శనాలకు సంబంధించిన టోకెన్లను ఒక్క రోజు ముందు భక్తులకు అందజేస్తారు. ఈ టోకెన్లు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసంలలో మాత్రమే జారీ చేయడానికి వీలుగా ఏర్పాట్లను చేపట్టారు టీటీడీ అధికారులు.
విషయం తెలిసిందే.
అదేవిధంగా తిరుమల స్థానికుల కోసం తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాట్లు చేస్తోన్నారు. వైకుంఠ ద్వార దర్శనం రోజుల్లో శ్రీవారి దర్శనభాగ్యాన్ని కల్పించడంలో సామాన్యులకే పెద్ద పీట వేస్తోన్నారు టీటీడీ అధికారులు. ఈ క్రమంలో వీఐపీలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. సిఫారసు లేఖలనూ స్వీకరించట్లేదని ఇదివరకే వెల్లడించారు కూడా