*సంయమనం పాటించండి అని విన్నవించిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు*

By JANA HUSHAAR
Published: Saturday, January 4, 2025.
తిరుమల: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శుక్రవారం నాడు 56,550 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 28,550 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.34 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.

ప్రస్తుతం భక్తులు వైకుంఠం కాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లల్లో వేచివుండనక్కర్లేదు. క్యూలైన్ ద్వారా నేరుగా స్వామివారి దర్శనానికి వెళ్లొచ్చు. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 నుంచి 6 గంటల సమయం పడుతోంది.

 

వైకుంఠ ఏకాదశి పర్వదినం కోసం ముస్తాబవుతోంది తిరుమల. జనవరి 10 నుండి 19వ తేది వరకు శ్రీనివాసుడిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునే భాగ్యం లక్షలాది మంది భక్తులకు కలగబోతోంది. దీనికోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. లక్షలాదిమంది భక్తులు వచ్చే అవకాశం ఉండటం వల్ల దానికి అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టింది.

వైకుంఠ ద్వారా దర్శనం కోసం తిరుపతి, తిరుమలలో జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి జనవరి 9వ తేదీన ఉదయం 5 నుండి 1.20 లక్షల టోకెన్లు జారీ చేయనున్నారు. ఇందుకోసం తిరుపతిలోని 8 కేంద్రాల్లో 90 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకొని మొత్తం 94 కౌంటర్లలో టోకెన్లు మంజూరు చేస్తారు.

తిరుపతిలో ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్‌, విష్ణునివాసం కాంప్లెక్స్‌, భూదేవి కాంప్లెక్స్‌, భైరాగి పట్టెడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్‌ పల్లిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, జీవకోనలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, అదేవిధంగా తిరుమల స్థానికుల కొరకు తిరుమల బాలాజీ నగర్‌ కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాట్లు చేస్తోన్నారు.

ఆయా కేంద్రాల్లో జరుగుతున్న ఏర్పాట్లను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పరిశీలించారు. కార్యనిర్వహణాధికారి జే శ్యామలారావుతో ఈ మధ్యాహ్నం రామచంద్ర పుష్కరిణి వద్ద గల కౌంటర్‌ను సందర్శించారు. అక్కడికక్కడే సమీక్ష నిర్వహించారు. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయని, 10,11,12వ తేదీల్లోనే స్వామివారిని దర్శించుకోవాలని అనుకోవద్దని అన్నారు.

టోకెన్లను తీసుకోవాలన్న ఆతృతలో ఒకరినొకరు తోసుకోకూడదని బీఆర్ నాయుడు చెప్పారు. భక్తులు సంయమనం పాటించి శ్రీవారిని దర్శించుకోవాలని సూచించారు. 19వ తేదీ వరకు ఎప్పుడైనా ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్సించుకోవచ్చని, ఈ 10 రోజులు కూడా వైకుంఠ ఏకాదశితో సమానమైనవేనని అన్నారు.

స్వామివారికి దర్శన భాగ్యాన్ని కల్పించడంలో వారికే అధిక ప్రాధాన్యతను ఇస్తోన్నామని, వీఐపీలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదని స్పష్టం చేశారు. సామాన్య భక్తులకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని, క్యూలైన్లు, బారీకేడ్లు, షెడ్లు, భద్రత, మంచినీరు, మరుగుదొడ్లు తదితర చర్యలు చేపట్టామని అన్నారు.

అనంతరం అలిపిరి పాదాల మండపంలోని శ్రీవేంకటేశ్వర స్వామివారిని బీఆర్ నాయుడు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేబుల్ టివి ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి ప్రత్యేకంగా తయారు చేయించిన

సుమారు అయిదు లక్షల రూపాయల విలువ చేసే వెండి పాదుకలు, వెండి కిరిటం, వరద హస్తం, కఠి హస్తం మరికొన్ని అభరణాలను చైర్మన్ చేతుల మీదుగా టీటీడీకి విరాళంగా అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *