
*వ్యక్తిత్వ వికాసంతో ఉన్నత జీవనం సాధ్యం : కమిషనర్ వై.ఓ నందన్*
వ్యక్తిత్వ వికాసంతోనే ఉన్నత జీవనం సాధ్యమని, వ్యక్తి స్వభావం, అలవాట్లు, నైపుణ్యాలు, ఆలోచనా విధానంలో స్థిరమైన అభివృద్ధిని సాధించడమే వ్యక్తిత్వ వికాసం అని నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ వివరించారు.
నెల్లూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ చిరంజీవి రెండు రోజుల పాటు స్థానిక కస్తూర్బా కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న సక్సెస్ మంత్ర శిక్షణా తరగతులను బుధవారం ప్రారంభించారు.
వార్డు సచివాలయ కార్యదర్శులు, కళాశాలల విద్యార్థుల కోసం రూపొందించిన శిక్షణా తరగతులకు సంభందించిన అన్ని ఏర్పాట్లను కమిషనర్, డిప్యూటీ డైరెక్టర్ మాధురి, జె.ఏ.సి పి4 బృందాలు ప్రత్యేక చొరవ తీసుకుని పర్యవేక్షించారు.
శిక్షణా కార్యక్రమంలో కమిషనర్ పాల్గొని ప్రసంగించారు. వ్యక్తిత్వ వికాసానికి వివిధ విశిష్టతలు ఉన్నాయని, వాటిలో ముఖ్యంగా ఆత్మ విశ్వాసం పెంపొందించుకుంటే ధైర్యం, నమ్మకం పెరిగి
సవాళ్లను ఎదుర్కోవడంలో ధైర్యాన్ని కలిగిస్తుందని వివరించారు.
విధుల నిర్వహణలో నైతిక విలువలు పాటిస్తూ నిజాయితీగా మెలగాలని, అర్థవంతమైన ప్రవర్తనతో
సమాజంలోని ఇతరులతో మంచి సంబంధాలు కలుగుతాయని వివరించారు.
వ్యక్తిత్వ వికాసం శిక్షణ ద్వారా సామాజిక నైపుణ్యాలు పెరిగి ఇతరులతో వ్యవహరించడంలో ప్రావీణ్యత సాధించగలమని తెలిపారు.
వ్యక్తిత్వ వికాస విశిష్టతలు వ్యక్తిని ఉత్తమమైన వారిగా తీర్చిదిద్దడంలో సహాయపడతాయని, సమాజంలో, తన జీవితంలో శ్రేయస్సును పెంచుకోవడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని కమిషనర్ వెల్లడించారు. శిక్షణ తరగతులను అన్ని విభాగాల వారు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ సూచించారు.
వార్డు సచివాలయ కార్యదర్శులు, జిల్లా స్థాయి మున్సిపల్ సిబ్బందికి జనవరి నెలలో స్పోర్ట్స్ మీట్ నిర్వహించనున్నామని కమిషనర్ తెలిపారు.
వ్యక్తిత్వ వికాసం నిపుణులు డాక్టర్ చిరంజీవి మాట్లాడుతూ శిక్షణలో భాగంగా సచివాలయం కార్యదర్శులు సంధించిన వివిధ ప్రశ్నలకు సమాధానాలు అందించారు. శిక్షణ ద్వారా కొంతమంది జీవితాల్లో అయినా ఉన్నతమైన మార్పును కలిగించేలా ప్రేరణ అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
కార్యక్రమంలో భాగంగా ఇంగ్లీష్ సులభంగా నేర్చుకునేందుకు డాక్టర్ చిరంజీవి రచించిన “ఇంగ్లీష్ బాస్” పుస్తకాల సంపుటాలను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ రామ్మోహన్ రావు, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కనకాద్రి, మలేరియా విభాగం అధికారి డాక్టర్ జిజియా బాయి, టి.పి.ఆర్.ఓ వాసు బాబు, సిబ్బంది పాల్గొన్నారు.
పి.ఆర్.ఓ.
నెల్లూరు నగర పాలక సంస్థ.