
*365 చ.అ, 430 చ.అ టిడ్కో గృహాల కోసం దరఖాస్తు చేసుకొని సంబంధిత సచివాలయలో లేదా హౌసింగ్ విభాగాన్ని సంప్రదించాలని సూచించిన కమిషనర్*
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నెల్లూరు నగరపాలక సంస్థ గౌరవ మేయర్ దేవరకొండ సుజాత అశోక్, కమిషనర్ వై.ఓ నందన్ లు పాల్గొని అర్జీ దారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు.
కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి ఎల్.ఆర్.ఎస్ పథకం అమలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు, మౌలిక వసతుల కల్పన తదితర సమస్యలను ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చారని, వాటికి శాశ్వత పరిష్కారం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
అర్హులైన లబ్ధిదారులందరూ 300 చ.అ ఉచిత టిడ్కో గృహాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నోటీసులు ఇచ్చినప్పటికీ గృహాలకు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా స్వాధీనం పొందని 408 టిడ్కో గృహాలను అర్హులైన ఇతరులకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 ద్వారా ఈ వారంలో అందజేసేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేశామని ప్రకటించారు. ఏపీ స్టేట్ హౌసింగ్ బోర్డ్ కార్పొరేషన్ ద్వారా నిర్మించిన లేఔట్లలోని గృహాలను లబ్దిదారులు స్వాధీనం పొంది నివాసం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ తెలిపారు.
365 చ.అ, 430 చ.అ టిడ్కో గృహాల కోసం దరఖాస్తు చేసుకొని సంబంధిత సచివాలయ లో గాని లేదా నెల్లూరు నగరపాలక సంస్థలోని హౌసింగ్ విభాగాన్ని సంప్రదించాలని కమిషనర్ సూచించారు.
నెల్లూరు నగర పాలక సంస్థకు 2025-26 ఆర్ధిక సంవత్సరానికి గానూ సుమారుగా 200 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన 50% వడ్డీ రాయితీ ఇంకా కేవలం వారం మాత్రమే మిగిలి ఉన్నదని, కావున ఈ అవకాశం ద్వారా మార్చి 31వ తేదీ లోపు పన్నులను చెల్లించి వడ్డీ రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ సూచించారు.
నగరవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ ప్రజలు చెల్లించే పన్నుల ద్వారానే కొనసాగుతున్నాయని, నగరాభివృద్ధికి సహకరించేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని కమిషనర్ ఆకాంక్షించారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో విభాగాల వారీగా టిడ్కో హౌసింగ్ 14, టౌన్ ప్లానింగ్ 15, రెవెన్యూ 08, ఇంజనీరింగ్ 07, పబ్లిక్ హెల్త్ 02, హెచ్ సెక్షన్ 01, అడ్మినిస్ట్రేషన్ 01, మొత్తం 48 వినతులను కమిషనర్ స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, స్వర్ణ గ్రామ వార్డు సచివాలయాల అదనపు కమిషనర్ హిమబిందు, టౌన్ ప్లానింగ్ సి.పి రఘునాధరావు, ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ రహంతు జానీ, ఈ.ఈ శేషగిరిరావు, మేనేజర్ రాజేశ్వరి, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.