నెల్లూరు, జనవరి 25 :

*18 ఏళ్ళు నిండిన ప్రతి యువత ఓటు హక్కును కలిగిఉండటం, వినియోగించుకోవడం రెండూ అతిముఖ్యo : విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఉప కులపతి ఎస్ విజయభాస్కర్ రావు*

శనివారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో 15 వ జాతీయ ఓటరు దినోత్సవంను జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తోలుత కలెక్టరేట్లోని వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, నగరంలోని వివిధ కళాశాలల విద్యార్థినీ విద్యార్థులతో కలసి విక్రమ సింహపురి విసి, కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డి ఆర్ ఓ, ఆర్ డి ఓ లు మానవహారంగా ఏర్పడ్డారు. అనంతరం జరిగిన జాతీయ ఓటరు దినోత్సవ సమావేశంను జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభించారు.

ఈ సందర్బంగా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ విసి విజయభాస్కర్ రావు మాట్లాడుతూ, రాబోయే కాలంలో దేశ భవిష్యత్ ను నిర్దేశించే యువత తమ ఓటు ను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలన్నారు. ప్రతి యువత నూతన సంవత్సర పండుగను ఉత్సాహవంతంగా చేసుకున్నట్లుగానే, ప్రతి ఐదు సంవత్సరాలకు వచ్చే ఎన్నికల పండుగ లో కూడా ద్విగుణీకరించిన ఉత్సాహంతో పాల్గొనాలని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల ఎన్నికల్లో 95 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకుంటున్నారన్నారు. రాబోయే రోజుల్లో దేశ సరాసరి వయసు 29 సంవత్సరాలని, ప్రతి ఒక్క యువత ఓటు విలువ ను తెలుసుకుని భాద్యతగా వినియోగించాలన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్బంగా విశ్వవిద్యాలయ పరిధిలోని 98 కళాశాలలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని, తద్వారా నూతన ఓటు రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపట్టామన్నారు.

జిల్లా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ ఓటు హక్కు ప్రతి పౌరుడి మౌలిక హక్కుయని అన్నారు. గత ఎన్నికల సందర్బంగా చాలామందికి ఓటు హక్కును కల్పించామని, ఇంకా జిల్లాలో 18 ఏళ్ళు నిండిన దాదాపు 60 వేల మంది ఓటరు గా నమోదు చేయించుకోవాల్సిన వారున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు గురించి భాద్యత తీసుకోవాలన్నారు. డిగ్రీ, ఇంజనీరింగ్ చేరే సమయంలో ప్రతి ఒక్కరినీ ఓటు నమోదు చేసుకునేవిధంగా ప్రోత్సాహించాలన్నారు. పాఠశాల స్థాయిలోనే ఓటు హక్కు గురించి అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఎన్ సి సి, ఎన్ ఎస్ ఎస్, ఇతర సాంస్కృతిక క్లబ్బులు ద్వారా కాలేజీల్లో ప్రజాస్వామ్యంలో ఓటుకున్న ప్రాధాన్యతను తెలియజేయాలన్నారు. కాగా జాతీయ ఓటరు దినోత్సవ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలైన విద్యార్థినీ విద్యార్థులకు తమ అభినందనలన్నారు.

జాయింట్ కలెక్టర్ కార్తీక్ మాట్లాడుతూ బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తివంతమైనదని, భారతదేశంలో ప్రజాస్వామ్యం మరింతగా పరిఢవిల్లటానికి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలన్నారు. ఓటరు దినోత్సవ స్ఫూర్తితో యువత అందరూ ఓటు హక్కు నమోదుకు సిద్ధం కావాలన్నారు.

జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా భారత ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అందించిన సందేశాన్ని వర్చువల్ గా ఆహుతులకు ప్రదర్శించారు. ఈ సందర్భంగా నూతన ఓటర్లకు ఎపిక్ కార్డులను వైస్ చాన్సలర్, జిల్లా కలెక్టర్ సంయుక్తంగా అందజేశారు. అలాగే ప్రతి ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్న సీనియర్ ఓటర్లు కొప్పల నరసయ్య, వెంకటేశ్వర్లు, సుబ్బారావు, కృష్ణమ్మ, సుగుణమ్మ, కాంతారావు తదితరులను ఘనంగా సన్మానించారు. చివరగా జిల్లాస్థాయిలో నిర్వహించిన క్విజ్ , వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో సీనియర్, జూనియర్ విభాగాల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థినీ, విద్యార్థులకు జ్ఞాపికలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఉదయ భాస్కరరావు, ఆర్డిఓ అనూష, డి ఆర్ డి ఎ పిడి నాగరాజ కుమారి, ఆర్ ఐ ఓ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

( జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కార్యాలయం, నెల్లూరు వారిచే జారీ చేయడమైనది )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *