*13 ఏళ్ల కల.. ప్రశాంతమ్మ రాకతో నెరవేరిన వేళ..*
*ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక ధన్యవాదాలు : కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ ప్రశాంతి రెడ్డి*

– కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల బకాయిలపై ఫలించిన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ పోరాటం
– షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రశాంతమ్మ
– కోవూరు షుగర్‌ ఫ్యాక్టరీ కార్మికుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే
– సమస్యను సీఎం చంద్రబాబుకు వివరించిన వైనం
– స్పందించిన ముఖ్యమంత్రి.. 26 కోట్ల బకాయిలు చెల్లిస్తామని స్పష్టీకరణ
– 124 ఎకరాల్లో కంపెనీలు ఏర్పాటుకు ఏపీఐఐసీకి అప్పగించాలని ఆదేశాలు
– తద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు

ఏళ్లుగా పోరాటం చేస్తున్న కోవూరు షుగర్‌ ఫ్యాక్టరీ కార్మికుల జీవితాల్లో కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రశాంతమ్మ వెలుగులు నింపారు. కార్మికుల పోరాటాలకు తాను గొంతుకై నిలిచి ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న బకాయిల చెల్లింపునకు మార్గం సుగమం చేశారు. కోవూరు షుగర్‌ ఫ్యాక్టరీ కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.26 కోట్లు చెల్లించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుగారు అంగీకరించగా.. 124 ఎకరాలను ఏపీఐఐసీకి అప్పగించి పరిశ్రమల ఏర్పాటుకు ఉపయోగించాలని ఆదేశించారు. ఈ క్రతువులో ఎమ్మెల్యే ప్రశాంతమ్మ పోరాటం గురించి ఎంత చెప్పినా తక్కువే. కార్మికులను కలవడం దగ్గరి నుంచి వారి సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడం వరకు ఒక సుధీర్గ పోరాటం నడిపారు. అనుకున్నది సాధించి కోవూరు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చారు.

1979లో నెల్లూరు సహకార రంగం ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గం పోతిరెడ్డిపాలెం వద్ద కోవూరు కో-ఆపరేటివ్‌ షుగర్‌ ఫ్యాక్టరీ లిమిటెడ్‌ (సొసైటీ) పేరుతో కోవూరు షుగర్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు అయింది. అప్పటి నుంచి 2013 వరకు ఫ్యాక్టరీ పనిచేసింది. ఈ కంపెనీపై ఆధారపడి ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా వందలాది మంది ఆధారపడి జీవిస్తుండగా… వేలాదిమంది చెరకు రైతులకు ఆదరువుగా ఉండేది. సుమారు మూడు దశాబ్దాలపాటు ఎంతోమందికి తీపిని అందించిన ఫ్యాక్టరీ కాలక్రమంలో ఆర్థిక ఒడిదుడుకులతో 2013లో మూతపడటంతో వందలాది మంది కార్మికుల జీవితాలు రోడ్డునపడ్డాయి. బకాయిలు రాకపోవడంతో వారి జీవితం దుర్భరమైపోయి అగమ్యగోరచంగా మారాయి. దాంతో కార్మికులు 2013 నుంచి బకాయిల కోసం పోరాటం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు కార్మికులు మృతి చెందగా.. మరికొందరు మంచాలకే పరిమితమై పోయారు.

2024 ఎన్నికల ప్రచారంలో ప్రతి గడప తిరిగిన ఎమ్మెల్యే ప్రశాంతమ్మ.. కోవూరు షుగర్‌ ఫ్యాక్టరీ బకాయిల అంశంపై దృష్టి పెట్టారు. తనను గెలిపిస్తే.. కార్మికులకు రావాల్సిన బకాయిలను తెప్పిస్తానని హామీ ఇచ్చారు. గత సంవత్సరం ఏప్రిల్‌ నెలలో బుచ్చిరెడ్డిపాలెంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కలిసి ప్రచారంలో పాల్గొన్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతమ్మ.. ఇదే విషయంపై తమ వైఖరిని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీ మేరకు ఎన్నికలయ్యాక కోవూరు షుగర్‌ ఫ్యాక్టరీ బకాయిలపై ప్రశాంతమ్మ దృష్టి సారించారు. కార్మికులను పలుమార్లు కలిసిన ఆమె… వారి సమస్యను ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా ప్రస్తావించారు. గత ప్రభుత్వంలో కార్మికుల పట్ల వ్యవహరించిన తీరును ఎండగట్టారు. కార్మికుల బకాయిలు చెల్లించి వారిని ఆదుకోవాలని కోరారు. కార్మికుల గొంతును వినిపించిన ప్రశాంతమ్మ.. సమస్యను సీఎం గారి దృష్టికి తీసుకువెళ్లడంలో సఫలీకృతం అయ్యారు. అలాగే ఇదే అంశాన్ని జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌ గారు.. కలెక్టర్ల రివ్యూ మీటింగ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారి దృష్టికి తీసుకువెళ్లారు.

ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతమ్మ విజ్ఞప్తులను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు.. షుగర్‌ ఫ్యాక్టరీ కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.26 కోట్లు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా 124 ఎకరాలను ఏపీఐఐసీకి కేటాయించి అందులో పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నారు. సీఎం నిర్ణయంతో దాదాపు 466 మంది కార్మికుల కుటుంబాలకు మేలు జరగనుంది. దాంతో నియోజకవర్గవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే తమ సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇచ్చిన హామీ మేరకు బకాయిలు చెల్లించేలా కృషి చేస్తున్నారని, ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యే ప్రశాంతమ్మ కార్మికుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ సాకారం అవుతుండటంపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఇది ప్రజా ప్రభుత్వమని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed