
*హోసియరీ మరియు రెడీమేడ్ గార్మెంట్ క్లస్టర్ కోసం కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు వాస్తవమేనా? : ఎంపీ వేమిరెడ్డి. ప్రభాకరరెడ్డి*
మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (MSE-CDP) కింద, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో హోసియరీ మరియు రెడీమేడ్ గార్మెంట్ క్లస్టర్ కోసం ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్ 2021లో ఆమోదించబడిందా అని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆరా తీశారు. లోక్ సభలో ఈ మేరకు గురువారం పలు ప్రశ్నలు వేశారు. ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్ని నిధులు విడుదల చేసిందని ప్రశ్నించారు. మార్చి, 2025 నాటికి ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉన్నా.. పూర్తి చేయడంలో జాప్యానికి గల కారణాలపై వివరాలు కోరారు.
ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ప్రశ్నలకు సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థల సహాయ మంత్రి సుశ్రీ శోభ కరండ్లజే సమాధానం ఇచ్చారు. మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (MSE-CDP) కింద, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులోని హోసియరీ & రెడీమేడ్ గార్మెంట్స్ క్లస్టర్‌లో కామన్ ఫెసిలిటీ సెంటర్ (CFC) ఏర్పాటు ప్రతిపాదనను 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ. 8.2298 కోట్ల మొత్తం ప్రాజెక్టు వ్యయంతో ఆమోదించారని చెప్పారు. ఇందులో ఇప్పటివరకు విడుదల చేసిన మొత్తం గ్రాంట్ రూ. 4.03256 కోట్లు కాగా ప్రాజెక్ట్ ఇప్పటి వరకు 57.92% పూర్తయిందని చెప్పారు.
11.08.2025న జరిగిన జాతీయ ప్రాజెక్ట్ అప్రూవల్ కమిటీ (NPAC) సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం మార్చి, 2026 వరకు ప్రాజెక్టు పూర్తికి గడువు పొడిగించాలని అభ్యర్థించగా 21.08.2025న ఆమోదం లభించినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ నివేదనల ప్రకారం COVID-19 మహమ్మారి ప్రభావం మరియు టెండర్లు & సేకరణ ప్రక్రియలో జాప్యాలు ఆలస్యానికి కారణాలుగా చెప్పారు.