- HMPV Virus: హెచ్ఎంపీవీ వైరస్ భయం… సీఎం చంద్రబాబు అలెర్ట్!
హెచ్ఎంపీవీ వైరస్ భయం… సీఎం చంద్రబాబు అలెర్ట్!By JANA HUSHAAR
Published: Tuesday, January 7, 2025,
భారతదేశంలోకి ఎంటర్ అయిన చైనా వైరస్ ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురి చేస్తుంది. ఇప్పటికే బెంగళూరులో ఇద్దరు చిన్నారులు హెచ్ఎంపీవీ వైరస్ బారిన పడినట్టు అధికారికంగా ధృవీకరించారు. ఇక తాజాగా గుజరాత్, చెన్నై, సేలం లలో కూడా హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదయినట్టు తెలుస్తుంది. ఇది చాలా సులభంగా వ్యాప్తి చెందే వైరస్ కావటంతో ఈ వైరస్ వ్యాప్తిపై ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
హెచ్ఎంపీవీ వైరస్ ఆందోళన.. చంద్రబాబు సమీక్ష
ఇప్పటికే తెలంగాణా ప్రభుత్వం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని చెప్పింది. ఇక తాజాగా ఏపీలోకి ఎన్డీయే ప్రభుత్వం కూడా హెచ్ఎంపీవీ వైరస్ కేసులు దేశంలో నమోదవుతున్న నేపధ్యంలో ఆరోగ్య శాఖాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి కీలక సూచనలు చేశారు. హెచ్ఎంపీవీ వైరస్ పై ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు.
అప్రమత్తంగా ఉన్నాం.. ఆందోళన వద్దు: చంద్రబాబు
రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని ఆయన పేర్కొన్నారు.అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలును తీసుకోవాలని వైద్య శాఖాధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
హెచ్ఎంపీవీ వైరస్ పై హెల్త్ డిపార్ట్మెంట్ కు దిశా నిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు బహిరంగ ప్రదేశాలలో మాస్కులు పెట్టుకోవాలని సూచించారు. ఈ వైరస్ పై భయపడాల్సిన అవసరం లేదన్నారు సీఎం చంద్రబాబు
వైద్య సదుపాయాల వివరాలు తెలుసుకున్న చంద్రబాబు
బెంగళూరు, గుజరాత్ ల్లో బయటపడ్డ వైరస్ పై దృష్టి పెట్టిన చంద్రబాబు హెచ్ఎంపీవీ వైరస్ యొక్క లక్షణాలు, తీవ్రత, ఎదుర్కోవటానికి శాఖా పరమైన సన్నద్దతపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. చికిత్స కోసం అవసరమైన ఔషధాల లభ్యతను తెలుసుకున్నారు. HMPV అనేది సాధారణ కాలానుగుణ వ్యాధి, తేలికపాటి స్వభావం కలదని వైద్యులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. అలా అని నిర్లక్ష్యం చేయదగినది కాదన్నారు.
వీరు జాగ్రత్తగా ఉండాలి
2001 నుండి HMPV ప్రబలంగా ఉన్నా, మరణాలు చాలా తక్కువగా ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీనియర్ వైద్య నిపుణులు తెలిపారు.రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న రోగులు, ఇమ్యునోగ్లోబులిన్‌లపై ఉన్న రోగులు, శిశువులు మరియు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు తీవ్రత ఎక్కువగా ఉండవచ్చు కాబట్టి, అటువంటి రోగులకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెప్తున్నారు.
వైద్య శాఖాధికారులకు చంద్రబాబు దిశా నిర్దేశం
అయితే సమీక్షలో చంద్రబాబు హెచ్ఎంపీవీ వైరస్ ఏపీలో వ్యాప్తి చెందకుండా, ఒకవేళ ఎంటర్ అయినా కట్టడి ఎలా చెయ్యాలి అన్న దానిపై పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని ఆరోగ్య శాఖాధికారులకు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో వైద్య శాఖలో ఈ వైరస్ ను ఎదుర్కోవటానికి ఉన్న మౌలిక వసతులపై ఆయన వివరాలు తెలుసుకుని, మరిన్ని వసతులు కల్పించుకోవాలని, మూడునెలల కాలానికి కావాల్సినవి సమకూర్చుకోవాలని సూచించారు.
Published On January 7, 2025