స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే పై ప్రజలకు అవగాహన కల్పించండి
– అదనపు కమిషనర్ నందన్
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన స్వచ్ఛ సర్వేక్షన్ సర్వే పై ప్రజలందరికీ అవగాహన కల్పించి, నెల్లూరు నగరపాలక సంస్థకు ఉత్తమ ర్యాంకు లభించేలా పారిశుద్ధ్య విభాగం అధికారులు సిబ్బందిని అదనపు కమిషనర్ వై ఓ నందన్ ఆదేశించారు.
పారిశుద్ధ్య విభాగం వారాంతపు సమీక్షలో భాగంగా కార్పొరేషన్ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో బుధవారం సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ ఇంటింటి చెత్త సేకరణ వాహనాల ద్వారా మాత్రమే వ్యర్ధాలను సేకరించాలని, బహిరంగ ప్రదేశాల్లో వ్యర్ధాలు వేసే వారిని గుర్తించి జరిమానాలు విధించాలని ఆదేశించారు.
ప్రధాన రోడ్లను ఎండ్ టు ఎండ్ వరకు శుభ్రం చేయాలని, రోడ్ల మూలల్లో, డివైడర్ల చివరన వ్యర్ధాలు, మట్టి, మురుగు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
భవన నిర్మాణ వ్యర్ధాలు, ఇసుక బస్తాలు, విద్యుత్, ఇతర తీగలు రోడ్లపై, వీధుల్లో ఉండకూడదని, సంబంధిత విభాగం వార్డు సచివాలయ కార్యదర్శుల దృష్టికి తీసుకెళ్లి క్లియర్ చేయించాలని సూచించారు. రోడ్ల వెంట చెత్త కుప్పలు, వ్యర్ధాలు ఉండకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని, పాత వస్తువులు, నిరుపయోగంగా ఉన్న వాహనాలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
డివిజన్ల వారీగా ఉన్న ఖాళీ స్థలాల వివరాలు, అపరిశుభ్రంగా ఉన్న ఖాళీ స్థలాల నివేదికలను ఉన్నతాధికారులకు అందజేయాలని అదనపు కమిషనర్ ఆదేశించారు.
నగరపాలక సంస్థ పరిధిలోని ప్రతి ఒక్క షాపును పన్ను పరిధిలోకి తీసుకొని వచ్చి ట్రేడ్ లైసెన్సులు తప్పనిసరిగా తీసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తుల విక్రయాలపై తనిఖీలు నిర్వహించి దుకాణదారులపై భారీ జరిమానాలు విధించాలని, ప్రత్యామ్నాయ వస్తువుల వినియోగంపై ప్రజలకు అవగాహన పెంచాలని సూచించారు.
ఫ్లోర్ పాయింట్లను పూర్తిగా తగ్గించివ్యర్ధాలు వేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్, బీడీ ఇతర ఉత్పత్తులను వినియోగించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న చిన్నారులకు పొగాకు ఉత్పత్తుల అమ్మకాలను నిషేధించినట్లు అదనపు కమిషనర్ తెలిపారు. అదేవిధంగా పాఠశాలలకు సమీపంలో 100 యార్డుల దూరంలోపు ఎలాంటి పొగాకు ఉత్పత్తుల విక్రయాలు జరపడాన్ని పూర్తిగా నిషేధించామని తెలిపారు.
నగరవ్యాప్తంగా దోమల నిర్మూలనకై క్రమం తప్పకుండా ఫాగింగ్ చేయడం, ఆయిల్ బాల్స్ పిచికారి, గంబుజియ చేప పిల్లలను కాలువల్లో వదిలిపెట్టడం తదితర కార్యక్రమాలను నిరంతరం చేపట్టాలని అదనపు కమిషనర్ సూచించారు
స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో ప్రజలు అందరూ పాల్గొనేలా అవగాహన కల్పించాలని, నగరంలో పారిశుధ్య నిర్వహణపై పౌరుల అభిప్రాయాలను తెలుసుకొని సర్వేలో పాల్గొనేలా అవకాశం కల్పించాలని వార్డు సచివాలయ కార్యదర్శులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య, వెటర్నరీ డాక్టర్ మదన్మోహన్, జిజియా బాయ్,శానిటేషన్ విభాగం అధికారులు, వార్డు సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.