స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాకారం దిశగా అడుగులు
– కందుకూరులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
– సామాన్య వ్యక్తిలా దూబగుంట గ్రామంలో పర్యటించిన సీఎం
– ఒక్క రోజు మన ఊరు శుభ్రంగా ఉంచటానికి పని చేయాలి
– చెత్త నుంచి సంపదను తయారు చేస్తున్నామన్న ముఖ్యమంత్రి
– మన ఇంటితో పాటు పరిసరాలు కూడా శుభ్రంగా ఉంటేనే స్వచ్ఛ ఆంధ్ర సాధ్యం
– దగదర్తి ఎయిర్ పోర్టు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసిన ఎంపీ వేమిరెడ్డి
– కందుకూరు నియోజకవర్గ సమస్యలను వివరించిన ఇంటూరి
స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాకారం దిశగా అడుగులు వేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్ఘాటించారు. చెత్త నుంచి సంపదను తయారు చేస్తూ సంపద సృష్టిస్తున్నామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. గంజాయి సహా మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కందుకూరు మండలం దూబగుంట (Doobagunta)లో ‘‘స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’’ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హాజరయ్యారు. ముందుగా స్థానిక డిగ్రీ కాలేజీలో హెలికాప్టర్ లో దిగిన ముఖ్యమంత్రి గారికి.. మంత్రులు పొంగూరు నారాయణ, డోలా వీరాంజనేయస్వామి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, కలెక్టర్ ఆనంద్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం దూబగుంట గ్రామ పరిధిలో ఏర్పాటు చేసిన మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి.. ప్లాంట్ విశేషాలు తెలుసుకున్నారు. అక్కడి నుంచి దూబగుంట గ్రామంలో ముఖ్యమంత్రి గారు పర్యటించారు. ఎలాంటి ఆర్భాటాలకు తావు లేకుండా సామాన్య వ్యక్తిలా రాష్ట్ర ముఖ్యమంత్రి తమ గ్రామం నలుచెరుగులా పర్యటించడంతో గ్రామస్తులు ఆనందపరవశులయ్యారు. గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు.
స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కందుకూరు వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం చంద్రబాబు గారు పరిశీలించారు. వేస్ట్ టు వెల్త్ సహా వివిధ మోడల్స్ ని చంద్రబాబు గారు పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. “స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. పరిసరాలు శుభ్రంగా ఉండేందుకు అందరూ శ్రమించాలని, ఏపీని స్వచ్ఛాంధ్ర చేయాలని సంకల్పించారు. పరిసరాలు శుభ్రంగా ఉంచేందుకు నెలలో ఒక్కరోజు కేటాయించాలని, స్వచ్ఛమైన ఆలోచనలు చేస్తేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు. నేరస్థుల పట్ల కఠినంగా ఉంటామని, ఆడబిడ్డల జోలికి వచ్చిన వారిని వదిలేది లేదన్నారు. గంజాయి ఉత్పత్తి చేస్తే ఉపేక్షింమని, గంజాయి రవాణాదారులపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. గత ప్రభుత్వంలో చెత్తపైనా పన్ను వేసి ప్రజలను వేధించారని, ప్రస్తుతం చెత్తను పునర్వినియోగం చేసేందుకు యోచిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను వైసీపీ ప్రభుత్వం అప్పుల రాష్ట్రంగా మార్చితే.. తాము సంపద సంపద సృష్టిపై దృష్టి సారించామన్నారు. ఏపీలో 50 శాతం పచ్చదనం పెంచేందుకు కృషి చేస్తున్నామని వివరించారు.
గత ఐదేళ్లుగా రోడ్లపై తట్టెడు మట్టి కూడా వైసీపీ సర్కార్ వేయలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రోడ్లపై గుంతలన్నీ పూడ్చి వేశామని సీఎం స్పష్టం చేశారు. ప్రతినెలా పేదల సేవలో ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, రాష్ట్రంలో 64 లక్షల మందికి రూ.33 వేలకోట్ల పెన్షన్లు ఇస్తున్నామని వివరించారు. ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి రాకూడదనే.. వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. సెల్‌ఫోన్ ద్వారానే సేవలు పొందేలా ఏర్పాట్లు చేశాం. యువత ఉద్యోగం చేయడం కాదు.. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి. ఎన్టీఆర్ హయాంలో మండల వ్యవస్థలు తీసుకువస్తే.. ప్రస్తుతం ప్రజల వద్దకే పాలన మేము తీసుకొచ్చామని” చెప్పారు.
నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు మాట్లాడుతూ.. బిపిసిఎల్, ఇండోసోల్ లాంటి భారీ పరిశ్రమలు తాను ప్రాతినిధ్యం వహించే నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. బిపిసిఎల్, ఇండోసోల్ రాకతో జిల్లాలో వేలాది యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. చెత్త పై పన్ను వేసే దుర్మార్గపు పాలన అంతరించి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో చెత్త నుంచి సంపద సృష్టించే ప్రభుత్వం వచ్చిందన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా అభివర్ణించారు. పరిసరాల శుభ్రతతో ఆరోగ్యంతో పాటు సంపద సమకూరుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ అని ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొనియాడారు. దగదర్తి వద్ద ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేయాల్సిన విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి తీసుకువెళ్లిన ఎంపీ.. నిర్మాణంపై త్వరితగతిన పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.
కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ… కందుకూరులో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని, రోడ్ల విస్తరణ చేపడితే వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. ప్రత్యామ్నాయంగా కందుకూరు పట్టణానికి ఉత్తరం వైపు బైపాస్ రోడ్డు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి విన్నవించారు. కందుకూరు మున్సిపాలిటీకి 2007 తర్వాత ఎన్నికలు జరగకపోవడం వల్ల నిధులు పెద్దగా రావడం లేదని సీఎం దృష్టికి తెచ్చారు. కందుకూరు మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. కందుకూరు చుట్టుపక్కల నాలుగు గ్రామాల ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న భూ సమస్యను ఇంటూరి నాగేశ్వరరావు ఈ సందర్భంగా ప్రధానంగా ప్రస్తావించారు. రైతులకు చెందిన సుమారు 18 వందల ఎకరాలు, గర్భ కండ్రికగా రికార్డుల్లో ఉన్నాయని, దానివల్ల భూముల అమ్మకాలు కొనుగోలు జరగడం లేదన్నారు. క్రయవిక్రయాలు లేక రైతులు నష్టపోతున్నారని, కనీసం ఆడపిల్లల పెళ్లిళ్లు చేయాలన్నా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. వెంటనే ఆ భూముల రిజిస్ట్రేషన్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు. నియోజకవర్గ పరిధిలో ప్రవహిస్తున్న ఉప్పుటేరు, మన్నేరు, పాలేరు నదులపై చచెక్ డ్యామ్ లు నిర్మించడం ద్వారా నీటిని పొలాలకు మళ్లించవచ్చని, ఆ దిశగా నిధులు విడుదల చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వంలో కందుకూరు నియోజకవర్గంను ప్రకాశం జిల్లా నుంచి విడదీసి నెల్లూరు జిల్లాలో కలపడాన్ని ఎమ్మెల్యే గుర్తుచేస్తూ…. గతంలో ఇచ్చిన హామీ మేరకు కందుకూరును తిరిగి ప్రకాశం జిల్లాలోని ఉంచాలని ఎమ్మెల్యే నాగేశ్వరరావు చంద్రబాబు నాయుడును కోరారు.
ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణ కాంత్, సిడియంఎ సంపత్ కుమార్, నెల్లూరు మున్సిపల్ కమిషనర్ సూర్య తేజ, కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీ పూజ, మాజీ శాసన సభ్యులు దివి శివరాం, ఇతర అధికారులు, ముఖ్యులు పాల్గొన్నారు.