సేకరణ వాహనాలకు మాత్రమే వ్యర్ధాలను అందించండి
– కమిషనర్ సూర్య తేజ
నెల్లూరు నగర పాలక సంస్థ పారిశుద్ధ్య విభాగం ఆధ్వర్యంలోనే చెత్త సేకరణ వాహనాలకు మాత్రమే వ్యర్ధాలను అందించాలని బహిరంగ ప్రదేశాలలో వ్యర్ధాలు వేయటం మానుకోవాలని కమిషనర్ సూర్య తేజ ప్రజలకు తెలియజేశారు.
పారిశుధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 44వ డివిజన్ పెద్ద బజార్, ముంగమూరి వారి వీధి, బార్కాస్ రోడ్డు, రాయాజీ వీధి, తిప్పరాజు వారి వీధి, శివ ప్రియ హోటల్, కలెక్టరేట్, మహబూబ్ ఖాన్ పార్క్ తదితర ప్రాంతాలలో కమిషనర్ మంగళవారం పర్యటించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాలలో వ్యర్ధాలు వేసే వారిని గుర్తించి హెచ్చరించాలని మరలా అదే విధంగా ప్రవర్తిస్తే భారీ జరిమానాలు విధించాలని ఆదేశించారు. రోడ్లపై పార్క్ చేసి ఉన్న నిరుపయోగంగా ఉన్న వాహనాలను గుర్తించి ట్రాఫిక్ పోలీస్ విభాగం వారి దృష్టికి తీసుకెళ్లి ఆయా వాహనాలను వెంటనే రోడ్లపై నుంచి తొలగించేలా చర్యలు చేపట్టాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.
నగరవ్యాప్తంగా ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ తమ ప్రాంగణాల్లోనే తమ వాహనాలను పార్కింగ్ చేసుకోవాలని సాధ్యమైనంతవరకు పబ్లిక్ రోడ్లపై వాహనాల పార్కింగ్ ను మానుకోవాలని కమిషనర్ సూచించారు. డివిజన్ పరిధిలో డ్రైన్ కాలువల పూడికతీత, సిల్ట్ ఎత్తివేత పనులను క్రమం తప్పకుండా జరిగేలా పర్యవేక్షించాలని కమిషనర్ ఆదేశించారు.
చిన్న బజారు ప్రాంతంలోని పాత కూరగాయల మార్కెట్ ప్రాంతంలో పశువుల సంచారాన్ని నియంత్రించేలా గేట్లు ఏర్పాటు చేయాలని,మహబూబ్ ఖాన్ పార్కు నందు లైటింగ్, పచ్చదనం కొరకు పూల మొక్కలు,చెట్లు,సీసీ కెమెరాలు ఏర్పాటు చేయవలసినదిగా ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ ఆదేశించారు. డివిజన్ పరిధిలో ఖాళీ స్థలాలను గుర్తించి జంగల్ క్లియరెన్స్ చేయించాలని, స్థల యజమానులకు నోటీసులు, పిదప హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి పిదప ఖాళీ స్థల పన్నులు వసూలు చేయాలని కమిషనర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ. రామ్ మోహన్ రావు, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య, డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఏ.డి.హెచ్.ప్రదీప్ కుమార్,వెటర్నరీ డాక్టర్.మదన్ మోహన్, రెవెన్యూ అధికారి ఇనాయతుల్లా, పట్టణ ప్రణాళిక విభాగం అధికారి ప్రకాష్ బాబు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.